ప్ర: శివుని ఆలయాలు శ్మశానంవద్ద ఉంటాయని క్రమంగా ఊళ్లు పెరగటంతో అవి ఊరి మధ్యకి వచ్చాయనీ, అందుకే శివాలయం నుండి రాగానే స్నానం చేయాలనీ, శివ ప్రసాదం ఇంటికి తీసుకురాకూడదనీ, శివ నిర్మాల్యాన్ని కూడా స్వీకరించరాదనీ ఈ మధ్య విడుదలైన ఒక పుస్తకంలో వ్రాశారు. అవి ఎంత వరకు నిజం?
జ: శ్మశానం వద్ద శివాలయాలు ఉంటాయి. నిజమే. కానీ శ్మశానం వద్ద 'మాత్రమే' ఉండవు. ఊరిమధ్యకూడా ఉంటాయి.అరుణాచలం,చిదంరం,శ్రీశైలంలాంటి వేలాది శివాలయాల సమీపంలో శ్మశానం లేవు కదా!
లయకారకుడుగా శివుని ఆరాధించినప్పుడు శ్మశానం వద్ద ఆయన మందిరం ఉండడం ఆశ్చర్యంకాదు. అది అమంగళము కాదు. శ్మశానానికి వెళ్ళినవారు అక్కడి ఆలయంలో శివుని చూడడం ద్వారా, ఆ పరమ మంగళ దర్శనం వల్ల అశుభాలు తొలగుతాయి. ఆ జ్ఞాన స్వరూపుని దర్శనం అజ్ఞానాన్ని పోగొట్టాలని ప్రార్థించాలి. అన్నీ లయమైన తాను నశించకుండా ఉండే పరతత్వం శాశ్వత సత్యం మాత్రమే అన్నిటినీ తనలో లయం చేసుకుంటుంది. తాను లయం చేసే వాటితో పాటు తాను లయం కాకుండా నిత్యంగా ఉండేవాడు మాత్రమే లయకారకుడు. నిత్యమైన పరబ్రహ్మయే సదా శివుడు. ఈ జ్ఞానం కలగడానికి,ఈ నిత్యత్వం స్ఫురించడానికి శ్మశానాలవద్ద శివాలయాలుంటాయి.
శ్మశానానికి వెళ్ళినవారు శివుని చూసి ఈ జ్ఞానం పొందడానికి ప్రయత్నించాలి. అయితే శ్మశానం నుండి వచ్చినందుకు వాళ్ళు స్నానం చేస్తారు. అంతేకానీ శివలయానికి వెళ్లినందుకు కాదు.
ఇక ఊళ్ళో ఉండే శివాలయాలకు మనం స్నానం చేసి శుచిగా వెళ్ళాలి. అంతేగానీ ఆలయంనుండి రాగానే స్నానమేకాదు కాళ్ళు కూడా కడుక్కోకూడదు. శివాలయానికి వెళ్లే వాళ్ళకి 'శివం' లభిస్తుంది. అంటే 'మంగళం, క్షేమం, శుభం' లభిస్తాయి. శివ శబ్దానికి ఇవే అర్థాలు.
ఊళ్ళో శివాలయాలు ఉండి తీరాలి. ఊరికి శుభం కలగాలంటే ఊరి మధ్యలో శివాలయం ఉండి, నిత్యం అభిషేకాదులు, అర్చనలు జరుగుతుంటే ఊరందరికి క్షేమం."విశ్వం పుష్టం గ్రామే అస్మిన్ అనాతురం"-అని వేదమంత్రం చెబుతోంది."ఈ గ్రామంలో ఉన్న స్థావర జంగమాత్మక ప్రాణకోటి, పంచభూతాలు పుష్టిగాను, ఆనందంగాను, క్షేమంగాను ఉండాలి" అని శివుని ప్రార్థిస్తోంది రుద్రనమకం. ఈ విధంగా ఊరికి శుభం శివారాధన వల్ల వస్తుంది. అందుకే అత్యంత ప్రాచీనకాలంనుండి ఈ దేశంలో శివరాధనకు ప్రాధాన్యం - ప్రాచీన త్రవ్వకాలలో శివాలయాలు చాలా బయటపడ్డాయి.
ప్రతి ఇంటా నిత్యం శివార్చన సాగాలి. అది ఆ ఇంట శుభాన్ని, ఐశ్వర్యాన్ని ఇస్తాయి. శివలింగం ఏ ఇంట్లో ఉంటే ఆ ఇంట్లో(ఐశ్వర్యం)లక్ష్మీ సుస్థిరంగా ఉంటుందని ఆగమాలు చెబుతున్నాయి.
కొన్ని శివాలయాలలో ప్రసాదం, నిర్మాల్యం ఇంటికి తీసుకురాకూడదని నియమం.ఏ ఆలయాలలో 'చండే(డ్రే)శ్వరుడు' అనే దేవత, అభిషేక జలం వెలుపలికి వచ్చే తూమువద్ద ప్రతిష్ఠించబడి ఉంటాడో ఆ ఆలయం నుండి మాత్రమే శివనిర్మాల్యాన్ని తీసుకురాకూడదు. ఆ చండేశ్వరునికే శివనిర్మాల్యంపై అధికారం అని శివుడిచ్చిన వరం. అందుకే ఆ దేవతకి ప్రసాదించబడిన శివనిర్మాల్యాన్ని మనం గ్రహించకూడదు.కానీ మన అర్చనాదులు నిరభ్యతరంగా చేసుకోవచ్చు.
అయితే - జ్యోతిర్లింగాలు, స్వయంభూలింగాలు, స్ఫటిక లింగాలు, బాణ లింగాలు, ఇంట్లో శివలింగాలు ఉన్న చోట 'చండీశ్వరుని'కి అధికారం లేదు. అక్కడ నిర్మాల్యం నిరభ్యంతరంగా తీసుకురావచ్చు.
ఇవి శివాగమాలు చెబుతున్న విషయాలు.
శివ నిర్మాల్యం స్వీకరిస్తే అమంగళాలన్నీ నశిస్తాయి.శుభాలు సమకూరుతాయి-అని శాస్త్రం చెబుతుంది. శివనిర్మాల్యాన్ని కించబరచినా,తూలనాడిన మహాపాతకం.
ఈ నియమాలేవీ తెలియకుండా పిచ్చిరాతలు రాసినవాళ్ళు కేవలం శివద్వేషులు. వారికి ఇహమూ, పరమూ రెండూ లభించవు.
🙏🏻 సేకరణ శ్రీ సామవేదం షణ్ముఖశర్మ గారి ప్రవచనం నుండి 🙏🏻
No comments:
Post a Comment