Wednesday, April 1, 2020

ఆదర్శ పురుషోత్తముడుసకల గుణధాముడు... శ్రీరాముడు

ఆదర్శ పురుషోత్తముడు




సకల గుణధాముడు... శ్రీరాముడు ఈ క్రింది యూట్యూబ్ వీడియో లింకులు నొక్కినచో (ప్రెస్ చేసినచో) వీడియోల ద్వారా, కోరిన సమాచారం మొత్తం చూడగలరు please suscibe my channel clickhere
ఆదర్శ పురుషోత్తముడు  
ఒక వ్యక్తి రూపాన్ని యుగాలుగా భారతీయులు తమ గుండెల్లో నిలుపుకొన్నారు. అదే వ్యక్తి గుణాల్ని ఆదర్శంగా లోకానికి చూపించారు. కొడుకు ఎలా ఉండాలంటే ఆయన్నే చూపిస్తారు. అన్న ఎలా ఉండాలంటే ఆయన పేరే జపిస్తారు. శిష్యుడికి ప్రతి రూపంగా ఆయన్నే తలుస్తారు. భర్త పదానికి ఆదర్శంగా కొలుస్తారు. పాలకుడంటే అచ్చంగా అలా ఉంటే చాలని తపిస్తారు. అదే మనిషిగా అవతరించిన దేవుడి రూపం, మనిషి దేవుడిగా ఎదిగిన రూపం. ఆయనే ‘రామో విగ్రహవాన్‌ ధర్మః’ అంటూ లోకమంతా ఆదర్శంగా చూపించే ఒక పెద్దగీత, సుగుణాల కలబోత శ్రీరామచంద్రుడు.

శ్రీరాముడు ఆదర్శపురుషుడు. ఏకపత్నీవ్రతుడు. సత్యవాక్పరిపాలకుడు, పితృవాక్పరిపాలకుడు. అన్నింటికీ మించి ఆదర్శపాలకుడు. అందుకే ‘మాతా  రామో... మత్‌ పితా రామచంద్రః, స్వామీ రామో మత్‌ సఖా రామచంద్రః, సర్వస్వం మే రామచంద్రో దయాళుః’ అంటూ యావత్‌ భారతజాతి తమకు అన్నీ రామచంద్రుడే అంటూ ఆ శ్రీరాముడి ఆదర్శాలను తలకెత్తుకుని, తమ ఆదర్శం ఇదీ అని కొలిచి చూపింది. అందరూ చరిత్రను ప్రస్తావిస్తూ కొన్ని నాగరికతల గురించి చెబుతారు. ఆ క్రమంలో ఎందరో పాలకులు, మరెందరో మానవులు. కొందరి చరిత్రలు కాలగర్భంలో కలిసిపోతే, మరెందరి చరిత్రలో చెదపురుగులకు ఆహారంగా మారాయి. కాలాలు గడిచినా, యుగాలు దాటినా తల్లి మాటల్లో, తండ్రి చేతల్లో, గురువు బాటల్లో రాముడి సుగుణాలు మాత్రమే నిలిచిపోయాయి. ఒక నాయకుడు మంచి పాలన అందిస్తే, అప్పటి ప్రజలు గుర్తుంచుకుంటారు. మరో నాలుగు తరాల తరవాత మరో నాయకుడు వస్తాడు. పాలన కాలం ముగిసిన యుగాల అనంతరమూ అందరి గుండెల్లో పదిలంగా ఉండి, చివరకు ఈ నేలమీద రాయి రప్పా సైతం రాజ్యమంటే రామరాజ్యమే అని చెబుతున్నాయంటే ఆయన ఎంతో గొప్ప నేతై ఉండాలి. ఆయన నడిచిన మార్గం ఎంతో ఉత్తమమైనదై ఉండాలి. ఆయన ఆచరించిన ధర్మం మరెంతో బలమైనదై ఉండాలి. ఎంత కాలం దాటినా రామాయణం మాత్రమే కాలదోషం పట్టకుండా, కాలగర్భంలో కలిసిపోకుండా నిలిచిపోయింది. ఇది రామాయణం రాసిన వాల్మీకి గొప్పతనమా లేదంటే తన జీవితమైన రామాయణాన్ని యుగాలుగా ఆదర్శాల మూటగా నిలిపిన శ్రీరామ చంద్రుడిదా!


సత్యవాక్పరిపాలన
సంస్కృతంలో ఆదర్శం అంటే అద్దం అనే అర్థం ఉంది. దేని సాయంతో నిన్ను నీవు సరిదిద్దుకోగలవో అదే అద్దం. అదే ఆదర్శం. ప్రపంచం మొత్తానికి భౌతికమైన అద్దం మాత్రమే తెలుసు. అద్దంలో చూసుకుని సరిదిద్దుకునే భౌతిక శరీరానికి విలువ ఇవ్వడం మాత్రమే తెలుసు. భారతీయులకు అద్దంతోపాటు ఆదర్శమూ తెలుసు. భౌతిక సౌందర్యంతో పాటు మానసిక సౌందర్యమైన ధర్మానికి విలువ ఇవ్వడమూ తెలుసు. జనుల గుండెల్లో శ్రీరాముణ్ని ఆదర్శంగా నిలిపిన గుణాలు మొత్తం 16. రాముడు గుణవంతుడు, శక్తిశాలి, ధర్మాత్ముడు, కృతజ్ఞతాభావం కలిగినవాడు, సత్యాన్ని పలికేవాడు, దృఢమైన సంకల్పం కలిగినవాడు. అన్ని ప్రాణుల మంచి కోరేవాడు, విద్యావంతుడు, ఎన్నిసార్లు చూసినా ఇంకా చూడాలనిపించేంతటి సౌందర్యం కలిగినవాడు. ధైర్యవంతుడు, క్రోధాన్ని జయించినవాడు, తేజస్సు కలిగినవాడు, ఎదుటివారిలో మంచిని చూసేవాడు. అవసరమైనప్పుడు కోపాన్ని తెచ్చుకోగలిగినవాడు. ఇన్ని సుగుణాల శ్రీమంతుడు గనుకే రాముడి కథను రాసే మహద్భాగ్యం తపఃసంపన్నుడైన వాల్మీకికి దక్కింది. శోకం నుంచి పుట్టిన శ్లోకమే రామాయణానికి మూలమైంది.

‘ధర్మో విశ్వస్య జగతః ప్రతిష్టితః’ అంటే ఈ విశ్వాన్ని పరిపాలించేది ధర్మమే అని అర్థం. అలాంటి ధర్మాన్ని కథారూపంలో రసవంతంగా సామాన్యులకూ అర్థమయ్యే విధంగా చెప్పిన ఆది కావ్యం- శ్రీరాముడి జీవితం. నిజం చెప్పాలంటే రామాయణం ప్రారంభించే దాకా రాముడి సుగుణాల గురించి తనకూ తెలియదని వాల్మీకి మహర్షి ఒప్పుకొంటూ నారదుడితో జరిగిన సంవాదం గురించి రామాయణ ప్రారంభంలో తెలియజేస్తారు. ఈ లోకంలో సద్గుణ సంపన్నుడు, ఎట్టి విపత్కర పరిస్థితుల్లో తొణకనివాడు, లౌకిక అలౌకిక ధర్మాలు తెలిసినవాడు, శరణాగత వత్సలుడు, ఎట్టి క్లిష్టపరిస్థితుల్లో అయినా ఆడిన మాట తప్పనివాడు, నిశ్చలమైన సంకల్పం కలిగినవాడు, సదాచార సంపన్నుడు, సకల ప్రాణులకు హితం గూర్చేవాడు, సకలశాస్త్ర కౌశలుడు, సర్వకార్య దురంధరుడు, తన దర్శనం ద్వారా ఎల్లరకు సంతోషం కలిగించేవాడు, ధైర్యశాలి, అరిషడ్వర్గాలను జయించినవాడు, రణరంగంలో ఆగ్రహోదగ్రుడై దేవాసురులను సైతం భయకంపితులను చేయగల పురుషుడు ఈ లోకంలో ఎవరైనా ఉన్నారా అని వాల్మీకి మహర్షి నారదుణ్ని అడుగుతాడు. ఈ గుణాలన్నీ కనిపించే శ్రీరాముడి గురించి తెలియజేయగా, శ్రీరాముడి చరిత్రను కావ్యంగా రాయాలని వాల్మీకి సంకల్పించడంతో మానవాళికి మార్గదర్శకమైన శ్రీమద్రామాయణ కావ్యానికి నాంది ఏర్పడింది.

శ్రీరాముడి గొప్పతనం గురించి తెలుసుకోవాలంటే ముందుగా ఆయన్ను ఒక పాలకుడిగా, ఒక మనిషిగా భావించి ఆయన జీవితాన్ని పరిశీలిస్తే తప్ప ఆయన గొప్పతనం అర్థం కాదు. ఎక్కడా ధర్మం తప్పకుండా మనిషి ఎలా జీవించాలో చూపినవాడు. 24వేల శ్లోకాల కావ్యంలో మానవ జీవన మార్గాల ఆవిష్కరణే రామాయణం. ముందుగా దశరథుడు రాముణ్ని అడవికి వెళ్ళమని ఆజ్ఞాపించిన సందర్భంలో ‘మాట తప్పని వ్రతంవల్ల నిన్ను అడవికి వెళ్ళమని ఆజ్ఞాపించాను. నన్ను ఎదిరించి, యుద్ధంచేసి, నన్ను ఓడించి, నా కళ్ళ ముందే తిరిగి రాజ్యపాలన చెయ్యి. వృద్ధుణ్ని గనుక నీ చేతిలో నేను సులభంగా ఓడిపోతాను. ఈ విషయంలో నేనేమీ అనుకోను. ఆనందపడతాను’ అని ఆ తండ్రి బతిమిలాడాడంటే, ఆ కోరిక తీరక అసువులు బాసాడంటే, పితృవాక్పరిపాలనకు కట్టుబడిన కొడుకుగా రాముడు ఎంత గొప్పవాడై ఉండాలి. ఒక్కడి కోసం ముగ్గురు తమ్ముళ్లు రాజ్యసుఖాలు త్యాగం చేసి అడవులకు వెళ్ళడానికి సిద్ధపడ్డారంటే, అన్న మాటను జవదాటకుండా, రాముడి పాదుకలకు పట్టాభిషేకం చేసి రాజ్యాన్ని పాలించారంటే అన్నగా రాముడు వారి హృదయాల్లో ఎలాంటి ముద్రవేసి ఉంటాడు? అడవికి రావద్దు.. హాయిగా హంసతూలికా తల్పాలమీద అంతఃపురంలో సేద తీరు అని చెప్పినప్పటికీ, నీవుపడే కష్టాలే నాకు స్వర్గసుఖాలు, నీవు లేని సుఖాలు నాకు నరకప్రాయాలు అంటూ ఓ భార్య అడవి బాట పట్టిందంటే భర్తగా రాముడు ఎలాంటి ఆదర్శమానవుడై ఉంటాడు.

రాముడు అడవికి వెళ్తున్నాడని తెలిసి ప్రజలంతా ఆయన తోటి అడవికి వెళ్ళడానికి సిద్ధమయ్యారంటే, రాముడు మాత్రమే తమకు రాజుగా కావాలని తపించారంటే- రాముడి వ్యక్తిత్వం ఎలాంటిదై ఉంటుంది. చిన్న చప్పుడుకే రివ్వున ఎగిరిపోయే ఒక పక్షి శ్రీరాముడి భార్యను కాపాడేందుకు ప్రాణాలు ఇచ్చిందంటే ఆయన ఎంతటి ప్రాణిదయ కలవాడై ఉండాలి. ఒక్క క్షణమైనా కుదురుగా ఉండలేని కోతి మూక ఓ మనిషి కోసం దండుగా కదిలిందంటే శ్రీరాముడు ఎంత సంస్కారై ఉండాలి. అతడి వల్లే ముక్కుచెవులు పోగొట్టుకున్న ఒక రాక్షసి శ్రీరాముడి అందాన్ని పొగిడిందంటే శ్రీరాముడి రూపలావణ్యాలను ఏ విధంగా ఊహించాలి. చివరకు తనకంటే బలవంతుడు ఎవ్వడూ లేడని విర్రవీగి, కైలాసాన్ని సైతం కదిలించేసిన రావణాసురుడు శ్రీరాముడు ఎదురైన సందర్భంలో శరసంధానం కూడా మరచిపోయి ఆయన అందాన్ని చూస్తూ ఉండిపోయాడంటే శ్రీరాముడి తేజస్సును ఎంతలా ఊహించుకోవాలి!

జననీ జన్మభూమిశ్చ...
దేశభక్తిని, మాతృభూమిపై రాముడికి ఉన్న ప్రేమను వర్ణించలేం. రావణవధ తరవాత అయోధ్యకు బయలుదేరే సమయంలో లక్ష్మణుడు రాముడితో లంకలోనే ఉండిపోదామని అన్నప్పుడు, శ్రీరాముడు ‘అపిస్వర్ణమయీ లంకా నమే లక్ష్మణ రోచతే... జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసీ’ అని చెప్పాడు. సువర్ణమయమైనప్పటికీ లంకా నగరంలో ఉండటం నాకు రుచించదు. జన్మభూమిని మించిన స్వర్గం మరొకటి ఉండదంటూ మాతృభూమి విశిష్టతను శ్రీరాముడు తెలియజెప్పాడు. ఉపాధి అవకాశాల కోసం ఏ దేశమేగినా, ఎంత ఎత్తుకు ఎదిగినా, నీకు జన్మనిచ్చిన దేశాన్ని సుసంపన్నం, సుభిక్షం చేసుకొనే క్రమంలో నీ బాధ్యతను సక్రమంగా నిర్వర్తించాలనే సందేశాన్ని రామావతారం మనకు బోధిస్తుంది. నిజానికి పదిమంది ఒక్కరినే పొగడటం అంత తేలిక కాదు. నాటి వాల్మీకి నుంచి నిన్న మొన్నటి విశ్వనాథ సత్యనారాయణ వరకూ అందరి కథల్లోనూ ఒక్కరే కథానాయకుడిగా నిలవడం, నాటి ఆంజనేయ స్వామి నుంచి త్యాగరాజస్వామి వరకూ అందరూ ఒక్కరి గుణాలనే కీర్తించడం, మహాత్మా గాంధీ అంతటివాడు గుండెల్లో తుపాకి గుండ్లు దిగినా నోటి వెంట రామ నామాన్నే జపించడం... ఇవన్నీ రాముడి ఆదర్శాలను చాటిచెబుతాయి. ఆయన జీవితం వారిని ఎంతగా ప్రభావితం చేసిందో కళ్లకు కడతాయి. రాముడి ధర్మ నిరతి నాటికి ఏనాటికీ అందరికీ ఆదర్శప్రాయమే. స్వార్థానికి, ధర్మానికి మధ్య జరిగే సంఘర్షణే మానవ జీవితం. స్వార్థాన్ని త్యజించి, ధర్మాన్ని అనుసరించే మానవుడు మాత్రమే అత్యున్నత శిఖరాలను అధిరోహించగలడు. అందరి మన్ననలు పొందగలడు. ఆకర్షణలు, ఆటంకాలు ఎదురైనా శ్రీరాముడు ఏనాడూ ధర్మం తప్పి ఎరుగడు. రాముడి కథ చుట్టూ ఎన్నో వాదాలు వివాదాలు ఉన్నప్పటికీ, రామరాజ్యమే కావాలని, రాముడి లాంటి పాలకుడు కావాలని మనమంతా కోరుకుంటాం. దీనంతటికీ రాముడు ధర్మమార్గంలో పరిపాలించడం ఒక్కటే కారణం. రాముడి జీవితం నుంచి, రాముడి 16 సుగుణాల నుంచి ఈ తరం నేర్చుకోవలసింది ఎంతో ఉంది. విల్లు ఎక్కుపెట్టాల్సిన పని లేదు, రాక్షస సంహారం చేయాల్సిన అవసరమూ లేదు, అడవులకు వెళ్ళాల్సిన అగత్యమూ లేదు. కొడుకుగా, శిష్యుడిగా, అన్నగా, భర్తగా, పాలకుడిగా, స్నేహితుడిగా రాముడు పాటించిన ధర్మ మార్గాలను అర్థం చేసుకుని ఆయన బాటలో ముందుకు సాగేలా ప్రయత్నిస్తే చాలు- విజయాలు మన వశం అవుతాయి. జనం గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయే యశస్సు మన సొంతం అవుతుంది. ఏ రాచరికాలు అందించని సంతృప్తి లభించి తీరుతుంది!

No comments:

Post a Comment

RECENT POST

నవ విధ శాంతులు

నవ విధ శాంతులు కొన్ని నక్షత్ర శాంతులకై పరిహారాలు జరుపవలసిన తొమ్మిది రకాల శాంతులు. 1. తైలావలోకనం:  కంచు లేదా మట్టిపాత్రలో తగినంత మంచి నూనె పో...

POPULAR POSTS