కాకతీయుల ఏలుబడి ముగిసిపోయిన పిదప ఎన్నో దేవాలయాలు శిథిలమైపోయాయి. వాటిలో ఇప్పటి భద్రకాళి గుడి ఒకటి.
భద్రకాళిగా పిలువబడుతున్న దేవతాశిల్పం రాతిగుండు మీద చెక్కబడింది. అష్టభుజాలతో కుడివైపు చేతులలో ఖడ్గం, జపమాల, ఢమరుకం, ఛురిక(?)లు, ఎడమవైపు చేతులలో గంట, త్రిశూలం, ఛిన్నమస్తకం, పానపాత్రలున్నాయి. పడమటివైపు చూస్తున్న దేవత ప్రేతాసనాసీనురాలై వుంది.
‘‘ప్రతాపరుద్ర చక్రవర్తి కాలానికే అమ్మవారు భక్తులకు కొంగు బంగారమై వారి కోర్కెలను తరుస్తూ ఉండినట్లు కన్పిస్తుంది. ఒకనాడు సుదర్శన మిత్రుడనే పండితుడు నూరుగురు పండితులు కొలుస్తూ ఉండగా ఏనుగుమీద ఎక్కి ఏకశిలానగరానికి వచ్చి అక్కడి విద్వాంసులతో వాదానికి వచ్చినట్లు చెప్పాడట! అది విన్న విద్వాంసులు అతనిని అవమానపరచి పంపివేశారు. దెబ్బతిన్న సుదర్శనమిత్రుడు ఆ విద్వాంసులను శాస్త్రపరీక్షలతో కాదు మాటలతో జయించాలనే ఉద్దేశంతో ఈ వేళ కృష్ణ చతుర్దశి, రేపు అమావాస్య. మీరు నాతో ఏకీభవిస్తారా? లేక కాదంటారా? అని సవాలు విసిరాడట! ఆస్థాన విద్వాంసులు ఇరకాటంలో పడ్డారు. ఎందుకంటే ఒప్పుకుంటే సుదర్శనమిత్రుని వాదం అంగీకరించినట్లు అవుతుంది. లేదంటేనే అతనిని ఓడించినట్లవుతుంది అని నిర్ణయించి రేపు పౌర్ణమి అని వాదించారట. ఆస్థాన విద్వాంసులు గెలవాలంటే మరునాడు పౌర్ణమి కావాలి. కాని కృష్ణ చతుర్దశి తరువాత వచ్చేది అమావాస్యయే కదా! ఆ సంకట స్థితి నుంచి తమను రక్షించుకోవటానికి ప్రతాపరుద్రుని ఆస్థాన కవియైన శాకవెల్లి మల్లికార్జునభట్టు ఆ రాత్రి హనుమకొండ వెళ్ళి భద్రకాళీదేవిని 11 శ్లోకాలతో స్తుతించాడట. సంతుష్టురాలైన ఆ తల్లి ప్రత్యక్షమై నీ మాటలనే నిలుపుతానని వరమిచ్చిందట. మరునాటి రాత్రి నిండుపున్నమిలాగా వెలుగొందిందట. అది చూసి సుదర్శన మిత్రుడు క్షమాపణ వేడుకొన్నాడట! ఇది కేవలం దైవశక్తికాని, మానుషశక్తి కాదని అంగీకరించి వెళ్ళి పోయాడట!’’
‘‘1950 ప్రాంతంలో ఓరుగల్లులో ఉండిన ఒక ప్రముఖ వ్యాపారి మగన్‌లాల్ సమేజాకి దేవి స్వప్నంలో కన్పించి పునరుద్ధరించమని ఆదేశించిందట. అందువలన ఆయన పునరుద్ధరణకు పూనుకున్నాడు. ఆ సందర్భంలో ఆయనకు శ్రీ విద్యాపాసకులు శ్రీ లలితానందనాథ దీక్షా నామధేయులు, మంత్రశాస్త్ర ప్రవీణులు శ్రీ విద్యానిధి అయిన బ్రహ్మశ్రీ హరి రాధాకృష్ణమూర్తి చేసిన సహకారము చిరస్మరణీయము. 1950 లో పునరుద్ధరించే సమయం వరకూ అమ్మవారు వ్రేలాడుతున్న నాలుకతో రౌద్రరసం ఉట్టి పడుతూ భయంకరంగా ఉండేది. ప్రాచీన కాలంలో కూడా అట్లాగే ఉండేదనటానికి "తనరు భద్రేశ్వరియనంగ భయదంబుగాగ" అన్న సిద్ధేశ్వర చరిత్రలోని మాటలే నిదర్శనము!
అలాంటి రౌద్ర స్వరూపిణిని నోటిలో అమృత బీజాలు వ్రాసిన ఒక రజిత యంత్రాన్ని ఉంచి, భీకరమైన ఆమె రూపాన్ని ప్రసన్నంగా మార్చినవారు హరి రాధా కృష్ణమూర్తి. అంతేకాక అమ్మవారి గుడిలో శ్రీ చండీయంత్రాన్ని ప్రతిష్ఠించి ప్రతి సంవత్సరము శరన్నవరాత్రులు, వసంత నవరాత్రులు, ప్రతినిత్యం ధూపదీప నైవేద్యాదులు జరిపే సంప్రదాయాలను నెలకొల్పారు.’’
No comments:
Post a Comment