జై హనుమంతా..జ్ఞానగుణవంతా..!
అతి బలవంతుడూ, అమిత పరాక్రమశాలీ, స్వామిభక్తి పరాయణుడిగా హనుమ స్థానం అత్యున్నతం. తాను నమ్మిన రాముడి కోసం ఎన్ని సాహసాలకు ఒడిగట్టాడో, తనను నమ్మిన భక్తులనూ అంతే నిష్ఠగా కష్టాల నుంచి ఒడ్డున పడేస్తాడు. అందుకే భక్తులందరికీ హనుమ అంటే కొండంత ప్రేమ. రామపాదాలంత భక్తి. ఆయన పుట్టిన రోజు దేశమంతటికీ పండగే. దుష్టానాం శిక్షణార్థాయ శిష్టానాం రక్షణాయచ।
రామకార్యార్థ సిద్ధ్యర్థం జాతః శ్రీ హనుమాన్ శివః।।
దుష్టులను శిక్షించడానికీ మంచివారిని కాపాడటానికీ సాక్షాత్తూ ఆ కైలాసనాథుడే హనుమంతుడి రూపంలో వచ్చాడని పరాశర సంహిత తెలియజేస్తోంది. అంతేకాదు, ఆ భక్తాగ్రజుడి జననాన్ని కూడా ఇందులో స్పష్టంగా పేర్కొన్నారు. వైశాఖమాసం కృష్ణపక్ష దశమి ఘడియల్లో శనివారంనాడు పూర్వాభాద్ర నక్షత్రంలో అంజనీ గర్భాన కేసరి జన్మించాడట. అంజనాదేవి కుమారుడు అయినందువల్ల ఆంజనేయుడయ్యాడు. బాల్యావస్థలో ఉన్న అంజనీసుతుడు తనకు ఆకలిగా ఉందంటూ తినడానికి ఏమైనా పెట్టమని అంజనాదేవిని అడిగాడు. అందుకామె బాగా ఎర్రగా పండిన ఏ ఫలాన్నైనా తినమని చెబుతుంది. సూర్యోదయవేళలో బాగా పండిన మధుర ఫలం కోసం వెతుకుతున్న వాయునందనుడికి ఆ రూపంలో సూర్యభగవానుడు కనిపిస్తాడు. భానుడిని ఎర్రని పండుగా భావించి, తినేందుకు ఒక్క ఉదుటున ఆకాశానికి ఎగిరాడు. ఆ రోజు సూర్యగ్రహణం కావడం వల్ల రాహువు కూడా సూర్యుడిని మింగదలచి అటువైపుగా వస్తూ బాలాంజనేయుడికి ఎదురెళతాడు. తనదారికి అడ్డం వచ్చాడన్న ఆగ్రహంతో రాహువును ఒక్కతోపు తోస్తాడు. భయంతో రాహువు దేవేంద్రుడిని శరణువేడగా, స్వర్గాధిపతి తన వజ్రాయుధంతో దాడి చేస్తాడు. వజ్రాయుధం దెబ్బకు దవడ (హనువు) వాయడం వల్ల ఆంజనేయుడికి హనుమంతుడనే పేరు వచ్చింది.
ఒక్కోచోట ఒక్కోరోజు...
స్వామి హనుమ జయంతిని ఒక్కో ప్రదేశంలో ఒక్కో రోజు నిర్వహిస్తారు. ఉత్తర భారతదేశంలో కొన్ని చోట్ల చైత్ర పౌర్ణమినాడు చేస్తుండగా దక్షిణ భారతదేశంలో పలు చోట్ల వైశాఖ బహుళ దశమినాడు నిర్వహిస్తారు. కేరళ రాష్ట్రంలో మార్గశిర మాసంలో హనుమజ్జయంతిని నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది.
సువర్చలా సమేతుడు
సువర్చలాదేవి సూర్యుడి కుమార్తె. ఆమెను ఆంజనేయుడు పెళ్లిచేసుకున్నాడట. హనుమజ్జయంతి రోజునే ఆయన పెళ్లి వేడుకలనూ దేశంలోని అనేక ఆలయాల్లో జరపడం ఆనవాయితీగా మారిపోయింది. చిన్నపిల్లాడిగా ఉన్నప్పుడే సూర్యుణ్ని పండుగా భావించి ఎగిరి అందుకోబోయిన హనుమంతుడు ఆయన దగ్గరే సకల విద్యలనూ అభ్యసించాడు. విద్యలన్నీ పూర్తయిన తర్వాత సూర్యుడు తన కుమార్తె సువర్చలాదేవిని వివాహం చేసుకోమని హనుమంతుడిని కోరాడట. ఆజన్మ బ్రహ్మచారి అయిన తానెలా పెళ్లి చేసుకోగలనని అడిగాడట. సూర్యభగవానుడి బలవంతం మీద సంసార బంధనాలు లేకుండా చివరికి నామమాత్ర పెళ్లికి అంగీకరించాడట వాయునందనుడు. అలా సువర్చలాదేవితో హనుమంతుడికి వివాహం అయిందని పురాణాలు పేర్కొంటున్నాయి. అందుకే దేశంలోని కొన్ని చోట్ల హనుమజ్జయింతి రోజున సువర్చలాంజనేయుల కళ్యాణాన్ని జరిపిస్తారు.
నిత్యపారాయణం...
సకలగుణ సంపన్నుడు స్వామి హనుమ. శ్రీమద్రామాయణంలో రాముడు నాయకుడిగా అన్ని కాండల్లో కనిపిస్తాడు. కానీ సుందరకాండలో మాత్రం హనుమంతుడే నాయకుడు. సుందరకాండ మొత్తంలో హనుమలేని ఘట్టం ఒక్కటీ కనిపించదు. ధైర్యం, లక్ష్యసాధనమీద ఏకాగ్రత, సునిశిత పరిశీలన, ఆత్మవిశ్వాసం, వివేకం వంటి లక్షణాలను ప్రదర్శించిన హనుమ ప్రతిఒక్కరికీ ఆదర్శంగా నిలుస్తాడు. మైనాకుడితో ప్రియవచనాలు పలకడం, సూక్ష్మబుద్ధితో సురస నోటి నుంచి బయటపడటం, రాక్షసి సింహికను పట్టి వధించడం, సీతమ్మకు ఆనందాన్ని కలిగించడం... ఇలా లంకాయానంలో అడుగడుగునా హనుమ ముద్ర ప్రస్ఫుటమవుతుంది. ఈ కారణంగానే రామాయణంలో అంతర్భాగమైనప్పటికీ సుందరకాండ స్వయంప్రతిపత్తిని పొందిన నిత్యపారాయణ గ్రంథంగా వెలుగొందుతోంది.
భక్తాగ్రజుడు...
హనుమంతుడు అంతులేని పరాక్రముడైనప్పటికీ శ్రీరాముడి సేవలో గడపడానికే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చాడు. ఆంజనేయుడికి శ్రీరాముడంటే ఎంతటి భక్తి ప్రపత్తులంటే మనసే మందిరంగా చేసి ఆరాధించాడు. ఇంకా చెప్పాలంటే సీతమ్మతల్లికంటే మిన్నగా ప్రేమించాడు హనుమ. దీనికి సంబంధించి ఒక కథ ప్రచారంలో ఉంది. ఒకసారి సీతమ్మ నుదుట సిందూరం పెట్టుకోవడం చూసి ‘సిందూరం ఎందుకు పెట్టుకున్నావమ్మా?’ అని అడుగుతాడు. అందుకు సీతమ్మ నవ్వి ‘శ్రీరాముడు దీర్ఘాయుష్కుడిగా ఉండాలని పెట్టుకున్నా’నంటుంది. అంతే హనుమంతుడు ఒక్కక్షణం కూడా ఆలస్యం చేయకుండా ఒళ్లంతా సిందూరం పూసుకుంటాడు. అదీ హనుమంతుడికి శ్రీరాముడి మీద ఉన్న భక్తి. అందుకే ఆయన భక్తాగ్రజుడయ్యాడు. తన భక్తిని చాటుతూ దేవుడయ్యాడు. తన ప్రవర్తనతో, భక్తితో ఎదిగిన కొద్దీ ఒదగడమెలాగో చెబుతూ మానవజాతికి మార్గనిర్దేశం చేశాడు.
జ్ఞాన గుణ సాగరుడు
జీవితంలో మనకు ప్రధానమైన శత్రువు భయం. మతంగ మహర్షి శాపం వల్ల వాలి ఋష్యమూక పర్వతం మీదకు రాలేడని సుగ్రీవునికి తెలుసు. అయినా ధనుర్బాణాలు, కత్తులు ధరించి, ఋషి వేషంలో ఉన్న బలిష్టులైన రామలక్ష్మణులను ఋష్యమూక పర్వత శిఖరాల మీద నుండి చూసి భయంతో బిగుసుకు పోయాడు సుగ్రీవుడు. అప్పుడు సుగ్రీవునికి ధైర్యం చెప్పే ప్రయత్నం చేస్తూ తొలిసారి మనకు రామాయణంలో దర్శనమిస్తాడు హనుమ. ఈ రకంగా చూస్తే హనుమ తొలి దర్శనంలోనే మనకు నిర్భయత్వాన్ని అలవరచుకొమ్మన్న పాఠం చెప్పే గురువు.
సందర్భోచిత వేషధారణ
సందర్భోచిత వేషధారణ హనుమను చూసే నేర్చుకోవాలి. సుగ్రీవుని కోరిక మేరకు రామలక్ష్మణులతో మాట్లాడ్డానికి వెళ్ళేముందు కపివేషంలో కాక భిక్షువు వేషంలో వెళతాడు. వచ్చినవారు ఎవరు, ఎలాంటి వారు అన్న విషయం తెలిసిన తర్వాతనే నిజరూపం ధరిస్తాడు. మనం రూపాలు మార్చలేకపోయినా వస్త్రధారణనైనా సందర్భోచితంగా మార్చుకోగలం గదా! సమయోచిత వేషధారణ మాత్రమే కాదు, సమయోచిత సంభాషణా చాతుర్యమూ హనుమకు వెన్నతో పెట్టినవిద్య.
అతను మాట్లాడిన నాలుగు మాటలకే మురిసిపోతాడు తానే గొప్ప వాగ్విశారదుడైన శ్రీరామచంద్రుడు.బలహీన క్షణాల్లో ఒక్కొక్కసారి ఎంత టి అసాధారణ ప్రజ్ఞావంతులకైనా క్షణం పాటు ‘ఆత్మహత్యతో ఈ బాధకంతా భరతవాక్యం పాడదామా‘ అని అనిపించవచ్చు. కానీ అలాంటి సందర్భాలలో కూడా వెంటనే తేరుకోగలగడం నిజమైన ధీశాలి లక్షణం. లంకానగరమంతా వెదికి సీత జాడ కానరాక హనుమంతుడు అదేస్థితికి చేరుకొంటాడు.
‘ సీతమ్మ జాడ దొరికే వరకు వానప్రస్థుడిలా ఉంటాను, లేదా అగ్నిలోకి ప్రవేశిస్తాను, లేదా నీటిలోకి ప్రవేశించి శరీరాన్ని వదిలేస్తాను’ అనుకున్నాడు హనుమ. కాని వెంటనే ‘ఆత్మహత్య మహాపాపం. జీవించి ఉంటేనే సుఖాలను పొందగలం. కనుక మళ్ళీ ఉత్సాహాన్ని పొంది వెతుకుతాను. ఎవడు శోకానికి లొంగిపోడో, ఎవడు నిరంతరం ఉత్సాహంతో ఉంటాడో, వాడు మాత్రమే కార్యాన్ని సాధించగలడు. అందుకని నేను శోకానికి లొంగను, మళ్లీ సీతమ్మని అన్వేషిస్తాను, మళ్లీ ఈ లంకాపట్టణం అంతా వెతికేస్తాను‘ అని ఉత్సాహాన్ని పొంది సీతాన్వేషణలో పడతాడు హనుమ. ఇదే సామాన్యులకూ, ధీశాలికీ మధ్య గల తేడా.
సిసలైన సంభాషణా చతురుడు
సంభాషణా చాతుర్యం అంటే ఊరకే మాట్లాడుతూ వెళ్ళడం కాదు. అవసరమైనపుడు అతి స్వల్పంగా, ముక్కుకు సూటిగా, క్లుప్తంగా, ప్రధాన విషయాన్ని హైలైట్ చేస్తూ మాట్లాడటం కూడా రావాలి. లంకనుంచి తిరిగి వచ్చిన తరువాత దూరం నించే‘దృష్టా సీతా‘ అని ఒక్క మాటలో తన కార్యం విజయవంతమైనదన్న విషయాన్ని సూచించి ఆ తరువాత మిగతా విశేషాలను వివరిస్తాడు.
అలాగే లంకలో సీత దగ్గిర అకస్మాత్తుగా ఊడిపడి గాభరా పెట్టకుండా కొమ్మమీద కూర్చుని మొదట రామకథను వినిపించి, ఆమెను తగిన మానసిక స్థితికి తేవడంలో హనుమంతుని నేర్పు కనిపిస్తుంది. అదీ మాట తీరు అంటే. ఇది మనం నేర్చుకోవాలి హనుమన్న దగ్గర. అంతేకాదు, సవాళ్లను స్వీకరించి సమర్థంగా ఎదుర్కొని విజయవంతంగా బయటపడటమెలాగో అన్న అంశాన్ని నేర్చుకోవడానికి హనుమన్న జీవితమే మనకు పాఠ్యపుస్తకం.
సముద్ర తీరానికి చేరుకొన్నప్పుడు హనుమన్న ప్రవర్తన చూసి వినయమంటే ఏమిటో, అన్నీ ఉన్నా ఒదిగి ఉండటమంటే ఏమిటో నేర్చుకోవాలి. సముద్రాన్ని దాటి లంకను చేరే పని నువ్వే చేయగలవని అందరూ కలిసి అడిగేంతవరకూ తానుగా నా బలమింతటిది అనీ, ఈ పని నేను చేయగలను అనీ మిడిసి పడలేదు. అవాంతరాలను ఎదుర్కొని కార్యసాధన చేయడమెలాగో, తొణకకుండా బెణకకుండా కార్యాన్ని చక్కబెట్టడమెలాగో హనుమ చేసి చూపించాడు.
మైనాకుడు అనే పర్వతం ఆదరించి ఆతిథ్యం స్వీకరించి పొమ్మని అడగటం, దాన్ని సున్నితంగా తిరస్కరించి ముందుకు సాగటం సానుకూలంగా కనిపించే విఘ్నాలను ఎలా ఎదుర్కోవాలో నేర్పుతాయి. భుజబలాన్నీ, బుద్ధిబలాన్నీ ఉపయోగించి విఘ్నాలను గట్టెక్కడం ఎలాగో సింహికను జయించడంలోనూ, సరమ నోటిలోనికి ప్రవేశించి బయటకు రావడంలోనూ చూపుతాడు.
ఆటంకాలను ఎలా ఎదుర్కోవాలన్న విషయాన్ని హనుమయ్య దగ్గర నేర్చుకోవాలి. అంతిమవిజయానికి ఉపయోగ పడుతుందనుకొంటే, కార్యసాధనలో అవసరమైతే చొరవతీసుకొని స్వతంత్ర నిర్ణయాలను కూడా తీసుకోగలిగి ఉండాలి కార్య సాధకుడు. సీతాన్వేషణకు బయలుదేరినప్పుడు, లంకా దహనం చేయమనీ, రాక్షస సంహారం చేయమనీ, రాముడు ఆయనతో చెప్పలేదు.
కానీ రామదూతనైన తనే ఇంత విధ్వంసాన్ని సృష్టించగలిగితే కపిసైన్యంతో రాముడు వస్తే ఎంత రాముడి ముందు తాను నిలవగలనా అన్న అనుమానాలను రావణునిలో రేకెత్తించడం అనే ప్రయత్నం చేయడం హనుమ తీసుకొన్న స్వతంత్ర నిర్ణయం. అక్కడికక్కడ నిర్ణయాలను తీసుకోగలగాలి.ఇలా హనుమంతుని దగ్గర మనమెన్నో వ్యక్తిత్వ వికాసలక్షణాలనూ, సకారాత్మక ఆలోచనా విధానాన్నీ, మేనేజ్ మెంట్ స్కిల్స్ అని చెప్పుకొనే యాజమాన్య కౌశలాన్నీ ఎంతైనా నేర్చుకోవచ్చు, నేర్చుకోవాలి కూడా. – రాయపెద్ది అప్పాశేష శాస్త్రి, ఆదోని
సమున్నతమైన ఆలోచనా విధానం, అసాధ్యాన్ని సుసాధ్యం చేసే తెగువ, అసాధారణ కార్యకుశలత, భయాన్నీ, నిరాశనూ, నిస్పృహనూ దరిచేరనివ్వని ధీశక్తి... వీటన్నిటి కలబోత ఉత్తమవ్యక్తిత్వం అవుతుంది. వీటికి తోడు బుద్ధిబలం, కీర్తిని సాధించాలన్న తపన, ధైర్యం, భయరాహిత్యం, వాక్చాతుర్యం, ఆరోగ్యంతో కూడిన బలిష్టమైన శరీరం వంటివి మనం కోరదగిన వ్యక్తిత్వంలోని అంశాలు. మన పురాణసాహిత్యాన్ని పరిశీలించినపుడు ఈ గుణాలలో కొన్ని, కొంతమందిలో కనపడవచ్చు. కానీ ఈ లక్షణాలన్నీ ఒక్కరిలోనే సందర్శించ గలమా అని ఆలోచిస్తే హనుమంతుడొక్కడే కానవస్తాడు.
కష్టాల్లో ఉన్న వాళ్ళను ఓదార్చడం గొప్ప కళ. అశోకవనంలో సీతతో మాట్లాడుతున్నప్పు్పడు చూడాలి హనుమ చాతుర్యం. ‘అమ్మా, వానరసైన్యంలో నాకన్నా తక్కువ వాళ్ళెవరు లేరు, నాతో సమానమైనవారూ, నన్ను మించినవారూ ఎందరో ఉన్నారు. రాముడు వానరసైన్యంతో రావణుని సునాయాసంగా జయించగలడు. కనుక నీవు నిర్భయంగా ఉండమ్మా‘ అన్న ఇటువంటి పలుకులు ఎంత దుర్భర పరిస్థితిలో ఉన్న వారికైనా ఎంత సాంత్వన కలిగించ గలుగుతాయో చూడండి. ఇదీ మనం హనుమ దగ్గర నేర్చుకోవాల్సిన చాతుర్యం.
No comments:
Post a Comment