నవవిధ భక్తి మార్గాల్లో పాదసేవనం ఒకటి. దానికి ప్రతీకగా హనుమంతుడిని ఉదహరిస్తూ ఉంటారు. శ్రీరామ మందిరాల్లో హనుమంతుడి విగ్రహం శ్రీరాముని పాదాల చెంతనే కనిపిస్తుంది. ఆంజనేయుడి విగ్రహమో, ఆలయమో ఉన్న చోట ఆయన అవక్రవిక్రమ పరాక్రమ రూపం దర్శనమిస్తుంది.
మారుతిది గుండెలు చీల్చి తన ప్రభువు రూపాన్ని చూపించేటంతటి రామభక్తి. ఆయన మహావీరుడు. సముద్రాన్ని లంఘించి, లంకాపురి చేరి, సీతమ్మను కలిసి, బంధించాలని చూసిన రాక్షసులకు బుద్ధి చెప్పి, లంకాదహనం చేసి, సీత సమాచారాన్ని శ్రీరాముడికి చేరవెయ్యడం వరకూ, ఆ తరువాత యుద్ధంలో రాక్షస వీరుల్ని పరిమార్చి, సంజీవి పర్వతం తెచ్చి లక్ష్మణుడికి ప్రాణదానం చెయ్యడం వరకూ... హనుమంతుడు కార్యసాధనలో చూపించిన దీక్ష, తెగువ, పట్టుదల విస్పష్టంగా కనిపిస్తాయి. అలాంటి వీరుడు భక్తికి ఒక ప్రమాణంగా నిలవడం విశేషం.
నిజమైన భక్తుడిని భగవంతుడు వెతుక్కుంటూ వస్తాడని నానుడి. అది హనుమంతుడి విషయంలో అక్షరసత్యం అయింది. ఆంజనేయుడి సామర్థ్యం తెలుసు కాబట్టే తన కార్యం కోసం అతణ్ణి శ్రీరాముడు ఎంచుకున్నాడు.
రామాయణ మహా కావ్యంలోని అన్ని కాండల్లో కథానాయకుడు శ్రీరాముడే. అయితే సుందరకాండ మినహాయింపు. ఈ కాండ ఆద్యంతం హనుమంతుడి పరంగా సాగుతుంది. సీతాన్వేషణకు బయలుదేరిన హనుమంతుడు సముద్రాన్ని దాటడానికి ఉద్యుక్తుడు అవడంతో ప్రారంభమైన సుందరకాండ సీతమ్మ జాడను శ్రీరాముడి చెవిన వేయడంతో ముగుస్తుంది. కార్యసిద్ధికీ, ఆపదల నుంచి బయటపడడానికీ, ఆటంకాలు తొలగడానికీ, మనశ్శాంతికీ సుందరకాండ పారాయణాన్ని తరుణోపాయంగా పెద్దలు చెబుతారు. ఎప్పుడు విక్రమించాలో, ఎక్కడ వినమ్రంగా వ్యవహరించాలో, సమయాన్ని బట్టీ, సందర్భాన్ని బట్టీ మసలుకోవడం ఎలాగో సుందరకాండలో ఆంజనేయుడిని గమనిస్తే తెలుస్తుంది. సూర్యుడి దగ్గర విద్య నేర్చుకొన్నది మొదలు రామాయణ కావ్యం చివరివరకూ హనుమంతుడి కథలో వ్యక్తిత్వ వికాసానికి సంబంధించిన అంశాలు కోకొల్లలు.
గోష్పదీకృత వారాశిం మశకీకృత రాక్షసమ్!
రామాయణ మహామాలా రత్నం వందే అనిలాత్మజమ్!!
No comments:
Post a Comment