నత్తా రామేశ్వరం క్షేత్రవిశేషాలు
నత్తా రామేశ్వరం' పేరు వినగానే విచిత్రంగా అనిపిస్తుంది. నత్త పేరు ఎందుకు వచ్చిందో, ఎలా వచ్చిందో తెలుసుకోవాలని అనిపిస్తుంది. సీతా సమేతంగా ఇక్కడికి వచ్చిన శ్రీ రామచంద్రుడు, 'నత్త గుల్లలు' కలిసిన ఇసుకతో శివలింగ ప్రతిష్ఠ చేయడం వలన ఈ ఊరుకి 'నత్తా రామేశ్వరం' అనే పేరు వచ్చిందని ఒక కధనం
శ్రీమన్నారాయణుడు ధరించిన దశావతారాలలో 'రామావతారం, 'పరశురామావతారం' ఎంతో విశిష్టమైనవి. ఈ రెండు అవతారాలలో శ్రీమహా విష్ణువు ఒకే ప్రదేశంలో రెండు శివలింగాలను ప్రతిష్ఠించడం ఒక విశేషం. అలాంటి గొప్పదనాన్ని పొందిన క్షేత్రం 'నత్తా రామేశ్వరం'. ఇది పశ్చిమ గోదావరి జిల్లాలోని పెనుమంట్ర మండలంలో ఉంది
ఈ ఆలయ విశిష్టత మార్కండేయ పురాణంలోను, వాయు పురాణాల్లోను వున్నది. పురాణ విశేషాలలోకి వెళితే -
శ్రీరాముడు రావణుడిని చంపి బ్రాహ్మణహత్య చేసాననే దిగులుతో పాపపరిహారనిమిత్తం ఎన్నోచోట్ల శివలింగాలకి ప్రాణ ప్రతిష్ట చేసాడు. శ్రీరాముడు సీతాదేవి కలిసి గోస్తనీ నదితీరం దగ్గరికి చేరుకోగానే అక్కడ శివలింగాన్ని ప్రతిష్టించాలని అనుకొన్నాడు. దానికి మద్యాన్న సమయంలో గోస్తనీ నదిలో త్రికోటి తీర్ధములు వచ్చి చేరుతాయని తలచి హనుమంతుని వారణాసికి పంపి శీవలింగమును తెమ్మని చెప్పేను. అయితే హనుమ వచ్చు సమయం మద్యాన్నం దాటుతుండుట వలన అక్కడే నదిలో నుండి నత్తలతో కూడిన ఇసుకమట్టిని తీసుకొని సీతాసమేతంగా ఒక శివలింగాన్ని తయారుచేసి ప్రతిష్ట చేసాడు. శ్రీరాముడు, సీతాదేవి కలిసి లింగాన్ని తయారు చేసాకా మిగిలిన ఇసుకముద్దని కూడా అక్కడే ఉంచేసారు. అలా నత్తలు, ఇసుకతో శివలింగాన్ని తయారుచేసి ప్రతిష్టచేసారని పురాణ కధనం.
ఇక ఇదే ప్రదేశంలో పశ్చిమాభి ముఖంగా మరో శివలింగం కొలువుదీరి కనిపిస్తుంది. దీనిని పరశురాముడు ప్రతిష్ఠించినట్టు పురాణాలు చెబుతున్నాయి.
పూర్వం పరశురాముడు గోస్తనీ నదీ తీరమున 9000 సంవత్సరాలు ఏకాగ్రచిత్తముతో శ్రీ మహావిష్ణువుకై తపమాచరించారు.ఆ తపస్సుకు మెచ్చిన శ్రీమహావిష్ణువు అతనికి తనలో నాల్గవ అంశముగా ఉన్న సువర్ణ వైష్ణవ ధనువు నీయగా అతడు దానితో అనేకమంది రాక్షసులను, కార్తవీర్యార్జుని జయించి పెడమార్గాలతో జనులను భాదించే కొందరు రాజులను, దుర్మార్గములైన క్షత్రియులను కూడా సంహరించినాడు
అటుపై హత్యల వలన ఏర్పడిన దోషాలను తొలగించుకొనుటకు కైలాసమునకు వెళ్ళి క్రౌంచ పర్వతమును భేదించి శివుని ఆనతితో పర్వతమునుండి ఒక లింగము తీసుకుని వచ్చి గోస్తనీతీరమున ప్రతిష్టించారు. సప్తమునులతో, బ్రహ్మర్షి, దేవర్షులతోడను, యాజ్ఞవల్క్యాది భూసురుల తోడను, ఆ లింగమునకు జలాదివాసం, ధాన్యాదివాసం, రత్నాదివాసం మొదలైన సంస్కారముల నాచరించి, అంతర్మాతృకా బహిర్మాతృకాదులచే ప్రాణప్రతిష్ట మొనర్చి స్థాపించినాడు.
అయితే పరశురాముని కోపాగ్ని వలన ఆ శీవలింగం అగ్నిలింగంలా కనపడేసరికి అయ్యో నా అహంకారం ఇంకా తగ్గలేదా అని బాధపడి శివలింగం చుట్టూ ఒక చెరువులా తవ్వి దానిని గోస్తనీ నది నీటితో నింపేసాడు.. స్వామి చల్లబడ్డాకా.. అయ్యోస్వామీ నీకు పూజలెలా అని బాధపడుతుంటే.. అప్పుడు స్వామి బాధపడకు పరశురామా.. నేను 11 నెలలు నీళ్ళతో ఉంటాను ఒక్క ఫాల్గుణమాసం లో అందరికీ కనిపిస్తూ ఉంటాను అని అభయమిచ్చాడు
ఆ లింగమునకు సప్తకోటేశ్వర రామలింగమని నామధేయము కలిగెను. భార్గవనిర్మితంబనీ క్షేత్రమము పంచక్రోశపరిమితమైనది. పరుశురాముడా క్షేత్రమునకు సర్వపాపహరమైనదిగాను, స్వరర్ణతీర్థఫలద్రాయకమైనదిగాను వరమిచ్చెను
అత్యంత పవిత్రమైన ఈ ప్రదేశంలో పరశురాముడు యజ్ఞయాగాదులు నిర్వహించాడు. మునులు ... ఋషులు ... దేవతలు ... ఇలా మొత్తం ఏడు కోట్ల మంది సమక్షంలో ఇక్కడి శివలింగాన్ని ప్రతిష్ఠించాడు. ఈ కారణంగానే ఈ శివలింగాన్ని 'సప్త కోటీశ్వర లింగం' అని కూడా పిలుస్తుంటారు. శ్రీ రామేశ్వరస్వామివారి నత్తలతో కూడియున్న లింగం కావున శంభూక రామమేశ్వరమని కూడా పిలువబడుతున్నది.
ఇక ఈ ఆలయం ఏడాది పొడవునా నీళ్లలో మునిగే వుంటుంది. అందువలన ఒక్క వైశాఖ మాసంలో మాత్రం గర్భగుడిలోని నీరు తోడి ఆ మాసమంతా పూజాభిషేకాలు నిర్వహిస్తుంటారు. ఈ క్షేత్రం వైభవోపేతంగా వెలుగొందడానికి తూర్పు చాళుక్యులు కృషి చేసినట్టు ఆధారాలు వున్నాయి. నత్తా రామలింగేశ్వరుడిని పూజించడం వలన ఆయురారోగ్యాలు కలుగుతాయనీ, సప్త కోటీశ్వర లింగాన్ని దర్శించడం వలన సిరిసంపదలు లభిస్తాయని భక్తులు విశ్వసిస్తుంటారు. ప్రతి యేటా ఇక్కడ జరిగే శివరాత్రి ఉత్సవాలను తిలకించేందుకు భారీ సంఖ్యలో భక్తులు తరలి వస్తుంటారు
అదేవిధంగా ఈ ఆలయ ప్రాంగణంలో సుబ్రహ్మణ్యేశ్వరస్వామి, వీరభద్రస్వామి, ఆంజనేయస్వామి, కాలభైరవస్వామి, గోస్తనీ నది ఒడ్డున లక్ష్మణేశ్వరస్వామి ఆలయాలు ఉన్నాయి. రామేశ్వరస్వామి ఆలయం రాష్ట్ర వ్యాప్తంగా ప్రముఖ పుణ్యక్షేత్రంగా పేరు గాంచింది. ఈ ఆలయంలో శివరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవోపేతంగా నిర్వహిస్తారు. ఈ ఉత్సవాల సందర్భంగా పదివేలమందికి అన్నదానం నిర్వహిస్తున్నారు. ఏటా ఈ ఆలయంలో జరిగే ఉత్సవాలకు అత్యధిక సంఖ్యలో భక్తులు విచ్చేసి స్వామివారిని దర్శనం చేసుకుంటారు. ముఖ్యంగా గోస్తనీనదిలో ఉన్న రామలింగేశ్వరస్వామి ఆలయం కేవలం వైశాఖమాసంలోనే భక్తుల సందర్శనార్థం తెరిచి ఉంటుంది.
ఈ స్వామిని పళ్ళ రసాలతో అభిషేకిస్తేముక్తిని పొందుతామని భక్తుల నమ్మకం. అందుకే వైశాఖ మాసంలో స్వామి దర్సనానికి పరిసర ప్రాంతాలనుండి కొన్ని వేల మంది భక్తులు వస్తారు.
నత్తా రామలింగేశ్వాలాయానికి నైరుతి దిక్కున కొన్ని వందల సంవత్సరాల వయస్సు గల అశ్వర్థ వృక్షం కలదు. ఈ చెట్టుకి ప్రదక్షిణలు చేస్తే సంతానము కలుగుతుందని భక్తులు విశ్వసిస్తారు.
పశ్చిమ గోదావరి జిల్లాలో తణుకు పట్టణం నుండి ఈ క్షేత్రము 14 కి.మీ. దూరంలో వున్నది. తాడేపల్లి గూడెం నుండి 28 కి.మీ. అత్తిలి నుంది. 6 కి.మీ. మార్టేరు నుండి 15 కి.మీ. దూరంలో ఈక్షేత్రమున్నది.
గోస్తనీ నది, తూర్పు చాళుక్యులు, సప్తకోటేశ్వరం
గోస్తనీ నది మహత్యం
పశ్చిమగోదావరి జిల్లాలోని పవిత్రమైన నదులలో గోస్తనీ నది కూడా ఒకటి.
ఈ నది నిడదవోలు మండలం శెట్టిపేట వద్ద గోదావరి నుంచి పాయగా జీవం పోసుకొని ఉండ్రాజవరం, తణుకు, ఇరగవరం, పెనుమంట్ర, అత్తిలి, పాలకోడేరు మండలాలు తాకుతూ 18 గ్రామాల మీదుగా 37,600 కిలోమీటర్ల మేర ప్రవహిస్తూ పాలకోడేరు మండలం గొల్లలకోడేరు నుంచి భీమవరం మండలం యనమదుర్రు డ్రయిన్ ద్వారా సముద్రంలో కలుస్తోంది.
గోస్తని చరిత్ర విశేషాలను తెలుసుకోవాలనుకొన్న నారదుడు బ్రహ్మదేవుని చేరి గోస్తని పుట్టుక, గొప్పధనం తెల్పమని అడుగుతాడు
దానికి బ్రహ్మదేవుడు - గోస్తనీనది పరమ పవిత్రమైనది. పూర్వం పృదుమహారాజు భూమండలాన్ని పరిపాలిస్తున్నపుడు ప్రజల ఆరోగ్యానికై ఓషదులను సాధించుటకు భూదేవిపై బాణము సందిచెను. దానికి భూదేవి ప్రత్యక్షమై ఓ రాజా నీ మనోభీష్టము తప్పక తీరగలదు. అని ఒక కామదేనువును ఆయనకు ప్రసాదించెను. తన కోరిక తెల్పిన రాజుకు ఔషదులతో కూడిన క్షీర ధారలను ప్రసాదించెను. అలా ప్రవహించిన ధారల ప్రవాహం పోను పోను విస్తరించుకొని నదిగా రూపాంతరం చెందినది. దానిలో స్నానం చేసినా, సేవించినా సకల రోగభాదలు తొలగి ప్రజలు సుఖశాంతులతో వర్ధిల్లిరి.
ఈ నదీ పరీవాహక ప్రాంతాన్ని ఆనుకొని ఉన్నానేక గ్రామాలలో నత్తారామెశ్వరం, జుత్తిగ, మల్లిపూడి లాంటి చరిత్ర కలిగిన చాలా పుణ్యక్షేత్రాలు ఉన్నాయి. ఈ క్షేత్రాలలో ఉత్సవాలు జరిగినపుడు (గతంలో) వేలాది మంది భక్తులు కార్తీక, మాఘ మాసాల్లో తమ విశ్వాసానికి అనుగుణంగా స్నానాలు ఆచరించే వారు. దీంతో పాటు పంట సాగుచేయడానికి వేలాది ఎకరాలకు నీరు కూడా అందించేది. వేసవిలో పశువులకు త్రాగునీరు అవసరాన్ని తీర్చేది. ఇంకా గత చరిత్ర తెలుసుకుంటే ఈ గోస్తనీ నదిలో ఇసుక రవాణా చేస్తూ పడవలు తిరిగేవని ఇప్పటి పెద్దలు చెబుతుంటారు.
🔴 అన్నట్టు దేశం లో “ పరశురాముని ఆలయం ” ఎక్కడైనా ఉందా . . . ? ? ?
రెండు ఉన్నాయి .!!
1 .కేరళ లో ఉంది #
2 .మన రాష్ట్రం లోనే , మన జిల్లాలోనే (W.G.dist)
పెరవలి మండలంలో ,అన్నవరప్పాడు గ్రామంలో 💐
త్వరలో అది కూడా చూసి వద్దాం.#🔵
ఓం శ్రీ సాయిరాం💐
No comments:
Post a Comment