మనందరికీ మహాభారతంలోని విషయాలు పరిచయమే. అందులోని అరణ్యపర్వం లోని కథ గుర్తు తెచ్చుకోండి.
భీముడు సౌగంధికాకమలాలను ద్రౌపదికోసం తీసుకునిరావడానికి బయలుదేరతాడు. అలా వెళ్ళినభీముడు గంధమాదనపర్వతం పైన ఉన్న కదళీవనం గుండా వెళుతూ అరటిచెట్లను పెకలించివేస్తూ అక్కడ ఒక సరోవరాన్ని చూస్తాడు. అందులో జలకాలాడి సింహగర్జన చేస్తాడు. ఆ గర్జనను ఆ కదళీవనంలో ఉన్న హనుమంతుడు వింటాడు. విని , భీముడు ఇదే ఊపుతో , బలగర్వితుడై ఉంటే తనకు దేవతలో,యక్షులో, మహర్షులో శాపం పెట్టక మానరు కనుక భీముని కాపాడాలంటే అతనికి గర్వభంగం చేయాలని అనుకుంటాడు. అనుకున్నదే తడవుగా దారికి అడ్డంగా ఒక ముసలివానర రూపంలో పడుకుంటాడు. అటుగా వచ్చిన భీముడు హనుమను చూస్తాడు. భీముడు దారికి అడ్డు తొలగమంటాడు. అపుడు హనుమ నాకు ఓపికలేదని తనని దాటి వెళ్ళమంటాడు. అపుడు భీముడు చక్కని సమాధానమిస్తాడు.
నిర్గుణః పరమాత్మా తు
దేహం వ్యాప్యావతిష్ఠతే।
తమహం జ్ఞానవిజ్ఞేయం
నావమన్యే న లంఘయే।।
"నిర్గుణుడైన పరమాత్మ ప్రాణులన్నిటి శరీరమున వ్యాపించి ఉన్నాడు. జ్ఞానం ద్వారా మాత్రమే తెలుసుకోగలిగిన అటువంటి భగవానుని నేను దాటి అవమానింపలేను."
హనుమంతుడు , ఆ సమాధానానికి లోలోపల పరమానందపడ్డాడు. పైకి మాత్రం తాను వృద్ధుడననీ , లేవలేననీ భీమునే వచ్చి తన తోకను పక్కకు జరిపి వెళ్ళమంటాడు. భీముడు పలుమార్లు ప్రయత్నించి భంగపడి ఆ వృద్ధవానరమునకు నమస్కరించి పరిచయమడుగుతాడు. అపుడు హనుమ తన నిజరూపాన్ని ధరించి ప్రత్యక్షమౌతాడు. తన వృత్తాంతాన్ని,రామకథను సంక్షేపంగా వివరిస్తాడు. భీముని కోరికపై విశ్వరూపం చూపిస్తాడు. అనంతరం జాగ్రత్తలు చెబుతాడు. నాలుగుయుగాలధర్మాలు, నాలుగు వర్ణాలధర్మాలు భీమునికి బోధ చేస్తాడు. ఆ మార్గం దేవమార్గమనీ, అక్కడ జాగరూకతతో మెలగమనీ చెబుతూ
"బలిహోమ నమస్కారైః
మంత్రైశ్చ భరతర్షభ।
దైవతాని ప్రసాదంహి
భక్త్యా కుర్వంతి భారత।।"
"భరతశ్రేష్ఠా! భీమా! దేవతలు బలి,హోమ, మంత్ర ,నమస్కారాదుల ద్వారా ప్రసన్నులై మన భక్తికి అనుగుణంగా మనకార్యాన్ని అనుగ్రహిస్తారు."
అని జాగ్రత్తలు చెప్పి ఈరోజు తన సోదరుని రాకతో ఆనందం కలిగిందనీ ,ఏదైనా వరం కోరుకోమంటాడు.
"దుర్యోధనుడిని సంహరించి రానా? లేదా బంధించి నీముందు పడవేయనా? " అని అడుగగా భీముడు, "వానరశిరోమణీ ! నాపై నీ కృప ఎల్లపుడూ ఉండేలా చూడుము. అది చాలు"అంటాడు. అపుడు హనుమ సంతసించి - "భీమసేనా ! రాబోయే సంగ్రామంలో రెండు విధాలుగా నేను మీ పాండవులకు సహాయపడతాను.
1. నీవు యుద్ధంలో గర్జించేటపుడు నీ గర్జనకు నా గర్జన కూడా జోడించి శతృసైన్యాన్ని నిర్వీర్యం చేస్తాను.
2. అర్జునుని రథధ్వజముపై ఉండి శతృప్రాణహరమైన దారుణమైన నాదమును చేస్తాను." అని పలికి భీమునికి మార్గాన్ని తెలిపి అంతర్ధానమౌతాడు హనుమ.
ఇక విషయానికి వస్తే , ఈ విధంగా హనుమంతుడు భీముని పరీక్షించినది, కటాక్షించి విశ్వరూపాన్ని చూపినది , వరమొసగినదీ అయిన ప్రదేశం హిమాలయాలలో ఎక్కడ ఉందో మీకు తెలుసుకోవాలని ఉందా ? లేదా ?
ఆ ప్రదేశమే #హనుమాన్_చట్టీ. ఇది బదరీనాథ్ వెళ్ళే దారిలో పాండుకేశ్వర్ అనే ఊరు వస్తుంది. అక్కడ నుండి 11కి.మీ. దూరంలో #బదరీనాథ్ వెళ్ళే దారిలోనే ఉంది. ఆ ప్రదేశంలో హనుమంతుని గుడి ఉన్నది. పాత ఆలయాన్ని 1991 లో పునర్నిర్మించారు. ఆశ్చర్యమేమంటే , బదరీనాథ్ వెళ్ళే ప్రతీవాహనము ఈ గుడిముందునుండి వెళ్ళవలసినదే. కానీ చాలమందికి ఈ ఊరు,అక్కడి ఈ ప్రదేశ విశిష్టత తెలియదు. మీరు ఈసారి దీనిని తప్పక దర్శిస్తారు కదూ ?
No comments:
Post a Comment