Tuesday, April 7, 2020

ఏ తిథినాడు ఏ దేవతను ఆరాధిస్తే ఎంతటి పుణ్యఫలం

ఏ తిథినాడు ఏ దేవతను 
ఆరాధిస్తే ఎంతటి పుణ్యఫలం

     వరాహ పురాణంలో శ్రీ మహావిష్ణువు ఏ తిథినాడు ఏ దేవతను ఆరాధిస్తే ఎంతటి పుణ్యఫలం కల్గుతుందనే విశేషాల గురించి భూదేవికి వివరించాడు.

    తిథులలో మొదటిదైన పాడ్యమినాడు అగ్నిని పూజించాలి. విదియనాడు అశ్విని దేవతలను ఆరాధించాలి. అశ్విని దేవతలను ఉద్దేశించి విదియ వ్రతాన్ని నియమనిష్టలతో చేయడంవల్ల ఆరోగ్యం సిద్ధిస్తుంది. తదియనాడు గౌరీదేవిని పూజించాలి. గౌరీ కళ్యాణం తదియనాడు జరిగినందువల్ల గౌరీదేవికి ఆ తిథి అంటే ఇష్టం. తదియనాడు గౌరీకళ్యాణం కథ చదవడంవల్ల పెళ్ళికాని కన్యలకు శీఘ్ర వివాహం జరుగుతుంది. వివాహితులకు అఖండ సౌభాగ్యం కలుగుతుంది. చవితి వినాయకుడు పుట్టిన తిథి. వినాయక చవితినాడే కాకుండా ప్రతీ చవితినాడు వినాయకుడిని పూజించవచ్చు. పంచమినాడు నాగులు జన్మించాయి. నాగదోషాలున్నవారు ప్రతీ పంచమినాడు పుట్టలో పాలుపోసి ఉపవాసముండి, నాగపూజ చేస్తే నాగులవల్ల భయం వుండదు. సప్తమి సూర్యుని జన్మతిథి. నాడే కాకుండా ప్రతి శుద్ధ సప్తమినాడు సూర్యున్ని ఆరాధించి క్షీరాన్నాన్ని నైవేద్యంగా పెడితే ఆయురారోగ్యాలు కలుగుతాయి. అష్టమి దుర్గాదేవి అష్టమాకృతులు ఆవిర్భవించిన తిథి. అష్టమినాడు దుర్గాదేవిని పూజించడంవలన శత్రు భయముండదు. నవమినాడు సీతారాములని పూజించడం శ్రేష్ఠం. నవమి స్వామి జన్మతిథి. ఆరోజున దంపతి తాంబూలాన్ని ఇవ్వడంవలన అనుకూల దాంపత్యం చేకూర్తుంది. దశమినాడు దిక్కుల సృష్ఠి జరిగింది. ఇంద్రాది దేవతలు ఈ దిశలకు పాలకులు. దిక్పాలకులను పూజిస్తే సకలపాపాలు తొలగుతాయి. ఏకాదశి కుబేరుడు పుట్టిన తిథి. ఈ తిథిన కుబేర పూజచేస్తే ఐశ్వర్యప్రాప్తి కల్గుతుంది. ద్వాదశి విష్ణువుకు ఇష్టమైన తిథి. ఈ తిథిరోజు విష్ణుమూర్తి వామన రూపంలో జన్మించారు. ద్వాదశి రోజు ఆవునెయ్యితో వ్రతంచేస్తే పుణ్యం లభిస్తుంది. ఈరోజున శ్రీ ఆంజనేయుని పూజించడం కూడా సర్వదా శుభకరం. త్రయోదశి ధర్ముడు పుట్టిన తిథి. ఈరోజున ఇష్టదైవారాధన చేయాలి. చతుర్దశి రుద్రుని తిథి. ఆనాడు రుద్రార్చన చేసినట్లైతే శుభప్రదం. కృష్ణ చతుర్దశినాడు మాస శివరాత్రి వస్తుంది. ఆ తిథి శివుడికి ప్రీతికరం. అమావాస్య పితృదేవతలకు ఇష్టమైన తిథి. ఆరోజు పితృదేవతలకు తర్పణాలనివ్వడంవలన వంశ అభివృద్ధి కలుగుతుంది. పౌర్ణమికి చంద్రుడు అధిపతి. పౌర్ణమినాడు పగలంతా ఉపవాసం ఉండి రాత్రికి చంద్రుడిని పూజించినచో ధనధాన్యాది అష్టఐశ్వర్యాలూ సిద్ధిస్తాయి. మానసిక బాధలు తొలగుతాయి.

     కాని అన్ని పూజలకన్నా మానవత్వంతో మసలడమే ముఖ్యం.
మానవత్వం ప్రేమ ఎదుటివారి కష్టాల్లో చేయూత నిచ్చే స్వభావం లేకపోతే ఎన్ని పూజలు చేసినా వ్యర్థమే అవుతాయ. గో సంరక్షణ చేస్తామని, గోవు మహనీయత తెలుసునని గోవుకు పూజలు చేస్తూ మరో గోవు కష్టాల్లో ఉంటేనో, లేక ఇంకో గోవును కబేళాకు తరలిస్తూ ఉంటేనో చూస్తూ ఉండడం ఏమాత్రం మంచిపని కాదు. కష్టాల్లో ఉండేవారిని ఆదుకోకుండా భిక్షకులను చీదరించుకుంటూ దేవుని హుండీల్లో మాత్రం కట్టల కట్టలు డబ్బులు వేస్తూ ఉండడమూ ధార్మిక లక్షణం కాదు. అంతేకాక ఉన్నది ఒక్కడే దేవుడు. ఆయన్ను నమ్మి కోరికలు లేకుండా భగవంతునికి ధన్యవాదాలో లేక కృతజ్ఞతలు చెప్పడమో లేక భగవంతుని స్తుతించడమో చేస్తే చాలు. అంతేకాని దేవుని పేరిట అన్యాయాలు అక్రమాలు చేయడం, లేకుంటే ఎదుటివారిని మనుష్యులుగా గుర్తించక ప్రవర్తించడం భగవంతుడు మెచ్చడు. కనుక మానవత్వంతో మెలగండి మనుష్యులుగా మారండి అదే భగవంతుని మెప్పిస్తుంది.- కురువ శ్రీనివాసులు

No comments:

Post a Comment

RECENT POST

నవ విధ శాంతులు

నవ విధ శాంతులు కొన్ని నక్షత్ర శాంతులకై పరిహారాలు జరుపవలసిన తొమ్మిది రకాల శాంతులు. 1. తైలావలోకనం:  కంచు లేదా మట్టిపాత్రలో తగినంత మంచి నూనె పో...

POPULAR POSTS