Tuesday, April 7, 2020

‘ఎత్తుగా మారిన ‘హనువులు’ (దవడలు) కలిగినవాడు’హనుమంతుడు

ధర్మవీరుడి జయంతి

ఇంద్రుడి వజ్రాయుధం చేసిన గాయంతో ‘ఎత్తుగా మారిన ‘హనువులు’ (దవడలు) కలిగినవాడు’ అనే అర్థంలో హనుమంతుడు ప్రసిద్ధుడయ్యాడు. ఆయన ధర్మవీరుడు. ధర్మసంరక్షణ కోసమే బలాన్ని ఉపయోగించిన వివేకవంతుడు. ఆ మహనీయుడి పుట్టినరోజైన వైశాఖ బహుళ దశమి లోకమంతటికీ పర్వదినం.
పుంజికస్థల అనే అప్సరస భూలోకంలో ‘అంజన’ పేరిట వానర స్త్రీగా జన్మించిందని, ఆమెను వానర వీరుడైన కేసరి పెళ్లిచేసుకున్నాడని పురాణ కథనం. ఆయన మహావీరుడు. నివాస స్థలం- మాల్యవంత పర్వతం. అదే పరమ పావనగిరిపై తపస్సు చేసుకుంటూ, లోకక్షేమం కోసం యజ్ఞయాగాలు ఆచరించే మహర్షుల్ని శంబసాధనుడనే రాక్షసుడు పీడించసాగాడు. వారందరూ కేసరిని ఆశ్రయించి, తమకు రాక్షస పీడ లేకుండా చేయాలని అర్థించారు. ఆ కోరికను మన్నించి ఆయన ధర్మ సంరక్షణార్థం రాక్షసుణ్ని వధించాడు. అంతటి ధార్మికత గల కేసరి ఆత్మజుడైన హనుమంతుడు ధర్మవీరుడు కాకుండా ఎలా ఉంటాడు?
సంతానం కోరిన కేసరి- శివానుగ్రహం కోసం తపస్సు చేశాడు. మెచ్చిన ఆ దైవం తన తేజస్సును వాయువు ద్వారా ఫలరూపంలో అంజనాదేవికి ప్రసాదించాడని, దాన్ని ఆరగించిన ఆమె పండంటి బిడ్డను ప్రసవించిందని భక్తుల విశ్వాసం. మరుత్తు (వాయుదేవుడు) అందజేసిన పండు కారణంగా జన్మించినవాడు కనుక, ఆ మహావీరుడికి ‘మారుతి’ అనే పేరు సార్థకమైంది.
బాల్యంలో ఒకనాడు ఆకలిగొన్న ఆంజనేయుడు, ఆకాశంలో ఎర్రగా కనిపించే సూర్యబింబాన్ని చూశాడు. అది పండు అనుకొని ఆకాశంలోకి ఎగసి ఆరగించే సమయంలో, ఇంద్రుడు అడ్డుపడ్డాడు. తన వజ్రాయుధంతో అంజనాసుతుడి దవడలపై కొట్టడం వల్ల, ఆయన హనువులకు గాయమై, హనుమంతుడయ్యాడు. ఇంద్రుడి చర్యకు ఆగ్రహించిన వాయుదేవుడు గాలిని స్తంభింపజేశాడు. లోకమంతా ప్రాణవాయువు లేక తల్లడిల్లింది.
అప్పుడు బ్రహ్మదేవుడు కల్పించుకొని, హనుమంతుడికి అనేక వరాలివ్వాలని దేవతలకు సూచించాడు. తన ఆయుధం వల్ల ఎలాంటి ఆపదా రాకుండా ఇంద్రుడు అభయమిచ్చాడు. సూర్యుడు తేజోరాశితో పాటు సకల శాస్త్రాల్నీ ప్రసాదించాడు. నీటి వల్ల మరణం లేకుండా వరుణుడు అనుగ్రహించాడు. యముడు కాలదండం వల్ల మృత్యువు రాకుండా వరమిచ్చాడు. అష్టదిక్పాలకులు అపూర్వ వరాలివ్వడంతో, హనుమంతుడు చిరంజీవియై సకల లోకాలకూ ఆరాధ్యుడైనట్లు పురాణాలు చెబుతున్నాయి.
విద్యాభ్యాసంలోనూ హనుమ పట్టుదల లోకానికి మార్గదర్శకం. ఆయన సమస్త వ్యాకరణాలకూ మూలదేవత అయిన సూర్యుణ్ని ప్రార్థించాడు. ఆ విద్యలన్నింటినీ నేర్పడానికి సూర్యుడు సిద్ధమైనా, ఎలా నేర్పాలి? తాను క్షణమైనా ఆగకుండా ప్రయాణిస్తుంటే, హనుమ ఎలా నేర్చుకుంటాడు? అదే విషయాన్ని సూర్యుడు చెప్పడంతో- ఉదయాద్రిపై ఒక కాలు, పశ్చిమాద్రిపై ఒక కాలు మోపి నిలిచి విద్యలు నేర్చుకుంటానని ఆయన బదులిచ్చాడు. అలా ఒక్కరోజులోనే సూర్యుడు సమస్త విద్యల్నీ మారుతికి బోధించి విద్యావంతుణ్ని చేశాడు.
వానర వీరుడైన హనుమ- మానవ వీరులూ ఆశ్చర్యపడేంత వివేకంతో వ్యవహరించాడు. ఆయన బుద్ధిబల సంపన్నుడు. అపార నిర్భయత్వం కలిగినవాడు. సద్గుణ మణులన్నీ ఆయనలో ఒదిగి ఉన్నాయి కనుకనే, మానవోత్తముడైన శ్రీరాముడికి ఆంజనేయుడు హితుడయ్యాడు. లోకంలో సద్గుణాలే పూజనీయాలని నిరూపించిన వారు పూజ్యులయ్యారు.
వాల్మీకి మహర్షి రామాయణ మహాకావ్యంలో హనుమంతుడి గుణ వైభవాన్ని వేనోళ్ల కొనియాడాడు. ధర్మబద్ధుడైన హనుమంతుడు- వేలమంది రావణులు అడ్డుపడినా, లక్షలాది రాక్షసులు తనపై రాళ్లవాన కురిపించినా భయపడక ముందుకు సాగుతానని ప్రకటించాడు. ధర్మాన్ని నిలపడమే తన ధ్యేయమని చాటిన ధర్మవీరుడాయన! అంతటి విశ్వాసం ఉన్న కారణంగానే, నూరు యోజనాల విస్తీర్ణం గల సముద్రాన్ని సునాయాసంగా దాటి వెళ్లాడు. ఆయన ధర్మవీరం నిరుపమానం!
సకలారాధ్యుడైన హనుమకు ఆలయాలు వూరూరా వాడవాడలా కనిపిస్తాయి. ఆయన సద్గుణ సంపదలు తమలోనూ భద్రంగా ఉండాలని మానవాళి కోరుకోవాలి. ఇదే హనుమజ్జయంతి సందేశం!
- డాక్టర్‌ అయాచితం నటేశ్వరశర్మ

No comments:

Post a Comment

RECENT POST

నవ విధ శాంతులు

నవ విధ శాంతులు కొన్ని నక్షత్ర శాంతులకై పరిహారాలు జరుపవలసిన తొమ్మిది రకాల శాంతులు. 1. తైలావలోకనం:  కంచు లేదా మట్టిపాత్రలో తగినంత మంచి నూనె పో...

POPULAR POSTS