మానవాళికి అర్థంకాని రహస్యాలెన్నింటినో దాచుకున్న ఆధ్యాత్మిక సిరులు హిమగిరులు. ఈ వెండికొండల్లోని అద్భుతం కైలాస పర్వతం. దాని చెంతనే బ్రహ్మ మానసం నుంచి ఉద్భవించిన మానస సరోవరం. జీవితంలో ఒక్కసారైనా చూసి తీరాలనుకునే మహోన్నత ప్రదేశాలివి. ఒకప్పుడు ఏ కొద్దిమందికో తప్ప.. కైలాస సదన దర్శనం అందరికీ సాధ్యమయ్యేది కాదు. ఆదిదేవుడు కొలువున్నాడని చెప్పే కైలాసగిరిని చూసే భాగ్యం ఇప్పుడు ఎందరికో చేరువైంది. మార్మిక లోకంలోని అద్భుతాలను.. మానస సరోవర తీరంలోని సోయగాలను చూసి తరించే మార్గమిదీ..!
ఆధ్యాత్మికతకు ఆలవాలం.. ప్రకృతి సౌందర్యానికి ఆటపట్టు.. హిమాలయాలు. మబ్బుల మాటున మాయమైపోయే పర్వతాలు.. వాటి శిఖరాలపై గొడుగులా పేరుకుపోయిన మంచు.. పర్వత పంక్తుల నుంచి యాత్రికులను పలకరించి ఏదో పనున్నట్లు లోయల్లోకి ఉరకలేసే జలపాతాలు.. మంచుకొండల్లోని అందాలివి! వీటన్నిటినీ మించి ఆకర్షిస్తుంది కైలాసగిరి. ఈ పర్వతం హిందువులకు మాత్రమే కాకుండా బౌద్ధులకు, టిబెట్‌లోని ప్రధాన మతాచారమైన బోన్‌లకు, జైనులకు కూడా అత్యంత పవిత్రమైనది. ప్రపంచ దేశాల నుంచి ఏటా వేలమంది యాత్రికులు, పర్యాటకులు కైలాస, మానస సరోవర సందర్శనకు వస్తుంటారు.
వేదాలు, పురాణేతిహాసాల ప్రకారం కైలాస పర్వతం భరతఖండంలోనే ఉండేది. క్రీస్తుశకం 7వ శతాబ్దం నుంచి టిబెట్ సామ్రాజ్యం స్థాపితమయ్యాక కైలాసగిరి ఆ దేశానికి చెందినదైపోయింది. 1950లో చైనా టిబెట్‌ను ఆక్రమించుకున్నాక భారతీయులకు కైలాస సందర్శనం కష్టమైపోయింది. 1959-1978 మధ్యకాలంలో ఈ శిఖర సందర్శనకు ఎవరికీ అనుమతివ్వలేదు. 1980ల నుంచి తిరిగి పరిమితంగా ఈ యాత్ర ప్రారంభమైంది. భారత ప్రభుత్వమే యాత్రను నిర్వహించేది. ప్రభుత్వం ద్వారా వెళ్లేవారినే యాత్రకు అనుమతించేవారు. వారి సంఖ్య చాలా స్వల్పంగా ఉండేది. కఠినమైన నిబంధనలు, పరీక్షలను తట్టుకుని.. సంపూర్ణమైన ఆరోగ్య పరీక్షలను ఎదుర్కొన్నవారికే కైలాస దర్శనభాగ్యం కలిగేది. కొన్నేళ్లుగా ప్రైవేటు యాత్రాసంస్థలు కూడా ఈ యాత్ర మొదలుపెట్టడంతో ఎవరికైనా కైలాసాన్ని దర్శించుకునే అవకాశం దక్కుతోంది. అయినా కైలాస, మానస సరోవర యాత్ర అనుకున్నంత తేలికగా ఉండదు. ఊహించని వాతావరణ పరిస్థితులు, మంచుగాలులు ఉక్కిరిబిక్కిరి చేస్తుంటాయి. ఎగుడు దిగుడు పర్వతాల మీదుగా యాత్రంతా సాహసోపేతంగా సాగిపోతుంటుంది. కైలాస శిఖరాన్ని దర్శించుకోవాలని, మానస సరోవరంలోని పవిత్ర జలాలను తాకాలనే సంకల్పంతో బయల్దేరిన యాత్రికులు ఈ కష్టాలకు వెరవకుండా ముందడుగు వేస్తారు.
ఎత్తు ఏడు కిలోమీటర్లు.. * టిబెట్ పీఠభూమిలోని హిమాలయాల్లో కైలాస పర్వతం సముద్ర మట్టం నుంచి 21,778 అడుగులు.. దాదాపు 6,650 మీటర్ల ఎత్తులో ఉంటుంది. (ఎవరెస్టు ఎత్తు 29,029 అడుగులు.. 8,848 మీటర్లు) అంటే సముద్రమట్టం నుంచి దాదాపు ఏడు కిలోమీటర్ల ఎత్తులో ఉన్నట్లు.
* కైలాస పర్వతం పాదాల చెంత సముద్ర మట్టం నుంచి 4,590 మీటర్ల ఎత్తులో మానస సరోవరం నెలకొని ఉంది.
* టిబెట్ పీఠభూమిలోని సరస్సులన్నీ ఉప్పునీటి సరస్సులే కాని.. మానస సరోవరం మాత్రం పూర్తిగా మంచినీటి సరస్సే. దీనికి సమీపంలో ఉన్న రాక్షస్‌తాళ్ కూడా ఉప్పునీటి సరస్సే.
* మానస సరోవర్ లోతు 300 అడుగులు. పరిధి సుమారు 90 కిలోమీటర్లు. ఉపరితల విస్తీర్ణం 320 చదరపు కిలోమీటర్లు. ప్రపంచంలోని అతిపెద్ద మంచినీటి సరస్సుల్లో ఇదొకటి.
* మానస సరోవరం... ఆసియాలోని పలు దేశాలకు జీవనదులైన.. సింధు, సట్లెజ్, బ్రహ్మపుత్ర, కర్నాలి (గంగానదికి ఉపనది) పుట్టినిల్లు.
ప్రదక్షిణకు మూడు రోజులు
* కైలాసగిరికి మేరు, సుమేరు, శుషుమ్న, రత్నసాహు, దేవ పర్వతమని పలు పేర్లతో పిలుస్తారు.
* ఆరు రేకులు విచ్చుకుని ఉండే తామర పువ్వులా.. చుట్టూ ఆరు పర్వతాల మధ్య కైలాస పర్వతం అద్భుతంగా కనిపిస్తుంది. ఈ ఆరు పర్వతాల చుట్టూ చేసే ప్రదక్షిణను బాహ్య పరిక్రమ అని, వీటిని వదిలి కేవలం కైలాస పర్వతాన్ని మాత్రమే చుట్టి రావడాన్ని అంతర ప్రదక్షిణ (ఇన్నర్ కోరా) అని అంటారు.
* మొత్తం 53 కిలోమీటర్ల చుట్టుకొలత ఉండే కైలాస పర్వతం చుట్టూ ప్రదక్షిణ చేయడం చాలా కష్టసాధ్యమైన పని. శారీరక పటుత్వం ఉన్నవారు.. వేగంగా నడవగలిగినవారికి 15 గంటల సమయం పడుతుంది. అస్థిర వాతావరణం, క్లిష్టమైన ఎత్తుపల్లాల కారణంగా చాలామంది 3 రోజుల పాటు ప్రదక్షిణ చేస్తారు.
* హిందువులు, బౌద్ధులు దీనిని సవ్యదిశలో (క్లాక్‌వైజ్) ప్రదక్షిణ చేస్తారు. జైనులు, బోన్ మతస్థులు అపసవ్య దిశ (యాంటీ క్లాక్‌వైజ్)లో ప్రదక్షిణ చేస్తారు.
* ఎలాంటి జనావాసాలు లేని ఈ ప్రాంతంలో ఆశ్రయం కూడా దొరకదు. కేవలం గుడారాల్లో ఉండాల్సి వస్తుంది.
* పలు మతాలవారికి పవిత్రమైనది కావడంతో దీనిపై కాలు పెట్టడానికి ఎవరూ సాహసించరు. పర్వతారోహకులు ఎవరూ దీనిని అధిరోహించడానికి సిద్ధపడరు.
* కాలి నడకన, లేదా పోనీ (కంచర గాడిదలు)లపై కాని యాక్స్ (జడల బర్రె)ల మీద కాని ప్రదక్షిణ చేయవచ్చు. కనీసం 3 రోజులు పడుతుంది.
రెండు లక్షలకు పైమాటే..
* కేంద్ర ప్రభుత్వంలోని విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో ఏటా కైలాస యాత్ర జరుగుతుంది.
* పాస్‌పోర్టు, ఫొటోలు, ఇతర వివరాలతో ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. ఇది చాలా సుదీర్ఘంగా, సంక్లిష్టంగా సాగే ప్రక్రియ. జూన్‌లో జరిగే యాత్రకు మార్చిలోనే గడువు ముగుస్తుంది. యాత్రికులను కంప్యూటర్ లాటరీ విధానంలో ఎంపిక చేస్తారు. రూ. 1,60,000 చెల్లించాలి. మొత్తం ఖర్చు రూ.2 లక్షలు దాటుతుంది.
* ప్రైవేటు యాత్రా సంస్థలు కైలాసయాత్ర మొదలుపెట్టాక యాత్రికుల సంఖ్య పెరిగింది. వీరు ఎక్కువగా నేపాల్ మీదుగా యాత్ర నిర్వహిస్తుంటారు. ప్యాకేజీ ధరలు రూ.1.80 లక్షల నుంచి 2.50 లక్షల వరకు ఉన్నాయి.
విభిన్న మార్గాలు* ప్రభుత్వం నిర్వహించే కైలాస యాత్ర ప్రధానంగా 2 మార్గాల్లో సాగుతుంది. ఒకటి ఉత్తరాఖండ్ నుంచి వెళ్లే లిపులేక్ మార్గం.. రెండోది సిక్కిం మీదుగా సాగే నాథులా మార్గం. వీటిలో మొదటిది చాలా సంక్లిష్టమైన మార్గం. చాలాదూరం నడవాల్సి ఉంటుంది. రెండోది వాహనాలు వెళ్లగలిగే మార్గం. వయసు మళ్లినవారిని ఈ మార్గంలో పంపిస్తారు.
* ప్రైవేటు సంస్థలు నేపాల్ మీదుగా యాత్ర నిర్వహిస్తుంటాయి. చైనా స్వాధీనంలోని భూభాగం కావడం వల్ల వీసా నిబంధనలు కష్టంగానే ఉంటాయి. వీటన్నింటినీ నిర్వాహకులే ఏర్పాటుచేస్తారు. నేపాల్‌లోని కాఠ్‌మండూ భూమార్గం నుంచి వెళ్లవచ్చు. లేదా కాఠ్‌మండూ నుంచి లాసాకు విమానంలో ప్రయాణించి అక్కడి నుంచి కారులో వెళ్తారు. ఈ ప్రయాణానికి నాలుగు రాత్రులు పడుతుంది. చివరికి సముద్ర మట్టానికి 4,600 మీటర్ల ఎత్తులో ఉండే దార్బేన్ అనే చిన్న ఔట్‌పోస్టుకు చేరతారు. ఇక్కడ విదేశీ యాత్రికుల కోసం అత్యాధునిక సౌకర్యాలున్న అతిథి గృహాలు అందుబాటులో ఉంటాయి.
రూట్ 1: కాఠ్‌మండూ నుంచి నేపాల్‌గంజ్, సిమికోట్, హిల్సా మీదుగా కైలాస్ పర్వతానికి చేరుకోవచ్చు. ఎక్కువమంది యాత్రికులు వెళ్లే మార్గం ఇదే. సిమికోట్ నుంచి హిల్సా వరకు హెలికాప్టర్ సౌకర్యం అందుబాటులో ఉంటుంది. పరిక్రమతో అయితే 8 రోజులు, పరిక్రమ లేకుండా కైలాసాన్ని చూసి వచ్చేసే పనయితే 5 రోజులు పడుతుంది.
రూట్ 2: కాఠ్‌మండూ - కైరోంగ్ - కైలాస పర్వతం.. ఇది పూర్తిగా భూమార్గంలో సాగుతుంది. 14 రోజులు పడుతుంది.
రూట్ 3: కాఠ్‌మండూ నుంచి లాసా వరకు హెలికాప్టర్‌లో వెళ్లవచ్చు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో కైలాసగిరి చేరుకోవచ్చు. ప్రకృతి ఒడిలో యాత్ర చేయాలనుకునేవారికి ఇది ఉత్తమ మార్గం. లాసా అందాలు, కైలాస దర్శనం రెండూ చేసుకోవచ్చు.
నాలుగు మాసాలు*
ఏటా సుమారు నాలుగు నెలలపాటు మాత్రమే కైలాస యాత్ర ఉంటుంది.
* ఈ ఏడాది జూన్ 8 నుంచి సెప్టెంబరు 8 వరకు కైలాస, మానస సరోవర యాత్ర కొనసాగనుంది.
* 18 సంవత్సరాలు నిండి 70 ఏళ్లకు పైబడనివారు.. సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నవారినే కైలాస యాత్రకు అనుమతిస్తారు. యాత్ర చేయాలనుకునేవారు ముందుగా వైద్యుడిని సంప్రతించి అన్నిరకాల పరీక్షలు చేయించుకున్నాకనే బయలుదేరాలి. వైద్యుడి సూచన మేరకు అవసరమైన మందులు తీసుకెళ్లాలి.
* పాస్‌పోర్టు, ఫొటోలు, ప్రభుత్వపరమైన గుర్తింపు కార్డు, ఆరోగ్య ధ్రువీకరణ పత్రం దగ్గరుంచుకోవాలి.
చూడాల్సినవి
* కైలాస పర్వతం, మానస సరోవరం, గౌరీకుండ్, రాక్షస్ తాళ్ (రావణుడు తపస్సు చేసిన స్థలం), యమద్వారం... దారిలో నేపాల్ రాజధాని కాఠ్‌మండూలో నెలకొని ఉన్న పశుపతినాథుడి దర్శనం.. హిమాలయ రాజ్యమైన నేపాల్‌లోని ప్రకృతి అందాలు అత్యద్భుతంగా ఉంటాయి.
అనుకూల సమయం
మే నుంచి అక్టోబరు వరకు వాతావరణం అనుకూలంగా ఉంటుంది. ఈ సమయంలో ఉష్ణోగ్రతలు 10 డిగ్రీల నుంచి 15 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉంటాయి. ట్రెక్కింగ్ చేయాలనుకున్నవాళ్లకు మంచి సమయం. బౌద్ధులు అత్యంత కోలాహలంగా జరుపుకొనే సాగా దావా ఉత్సవం ఈ సమయంలోనే ఉంటుంది. -వెంకూ
No comments:
Post a Comment