పద్మము యొక్క విశిష్టత
సృష్టిలో తొలి పుష్పంగా పద్మాన్ని భావిస్తారు. పద్మం నుంచి పుట్టిన బ్రహ్మ పద్మసంభవుడయ్యాడు. బ్రహ్మ ఆయుర్దాయంలో మొదటి సగాన్ని పద్మకల్పంగా పురాణాలు చెబుతున్నాయి.
‘పద్మం’ అనే పదానికి పారమార్థిక, యౌగిక, వాస్తుపరమైన అర్థాలున్నాయి. పద్మం దేహంలోని ఒక నాడీచక్రం. కుబేరుడి నవనిధుల్లో ఒకటి.
వాస్తురీత్యా నాలుగు దిక్కుల్లోనూ ద్వారాలు ఉన్న ఇంటిని కూడా పద్మమంటారు.పద్మం ముందు పుట్టి ఆ తరవాత సృష్టి పుట్టిందని పురాణోక్తి.
శేషతల్పంపై మహావిష్ణువు శయనించి ఉన్న సమయాన స్వామి నాభి నుంచి బ్రహ్మదేవుడు అవతరించాడని పురాణ కథనం. పద్మం పేరున ఓ పురాణమే వెలసింది. అదే పద్మపురాణం. అష్టాదశ పురాణాల్లో అది రెండోది. 50వేల శ్లోకాలు కలిగి విస్తృతిలో స్కాందపురాణం తరవాత రెండో బృహత్ పురాణం.
విష్ణువు మహత్వాన్ని తెలిపే పురాణం. పద్మాలు సరస్సులో, చెరువుల్లో, జలం సమృద్ధిగా ఉండేచోట వికసిస్తుంటాయి. తామర, కమలం, నలిని, పంకజం మొదలైన పేర్లతో వ్యవహరిస్తారు.ఎందరో దేవతలకు పద్మం ఆసనం. లక్ష్మీదేవి ఎల్లప్పుడూ పద్మంపై కూర్చుని హస్తాల్లో పద్మాన్ని ధరించి ఉంటుంది.
‘కమల’ శబ్దానికి లక్ష్మీదేవి అనికూడా అర్థం ఉంది. ఆ దేవిని ‘కమలాత్మిక’ అంటారు. కమలం ఆత్మగా కలిగిన దేవత అని అర్థం.
పంకమంటే బురద. బురదలో పుట్టిన పద్మం పంకజమైంది. బురదలో పుట్టినా ఎలాంటి మలినాలు అంటకుండా స్వచ్ఛంగా అందంగా కనిపిస్తుంది.
మనం కూడా బాహ్య పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ అంతర్గతమైన పవిత్రత, సౌందర్యం చెదరకుండా చూసుకోవాలని, నిర్మలంగా ఉండటానికి ప్రయత్నించాలని గుర్తుచేస్తుంది పద్మం. ఎప్పుడూ నీళ్లలోనే ఉన్నా తామరాకుకు తడి అంటుకోదు.
‘తామరాకు మీది నీటిబొట్టులా’ ఉండాలంటారు. జ్ఞాని దుఃఖంలో,సుఖంలో, విపరీత పరిస్థితుల్లో సైతం చలించకుండా ఆత్మానందంలో లీనమై ఉంటాడనడానికి ప్రతీకగా ఈ విషయం నిలుస్తుంది.
శుభసూచకమైన ‘స్వస్తిక్’ చిహ్నం తామర పువ్వు నుంచే ఉత్పన్నమైందని భావిస్తున్నారు. సూర్యుడు పద్మినీప్రియుడు. సూర్యభగవానుడికి ప్రీతికరమైన పద్మానికి సాహిత్యంలోనూ విశేషమైన స్థానం ఉంది.
యోగశాస్త్రం ప్రకారం మన దేహాలు శక్తి కేంద్రాలైన కొన్ని చక్రాలను కలిగిఉన్నాయి. ప్రతిచక్రం నియమిత దళాల పద్మాన్ని కలిగి ఉంటుంది. అంతేకాకుండా ధ్యానానికి కూర్చోవడానికి పద్మాసనం ఆమోదయోగ్యమవుతుంది.శరీరంలోని చైతన్య కేంద్రాల్ని చక్రాలంటారు.
మూలాధార చక్రం భౌతిక చైతన్యానికి కేంద్రం. నాభివద్ద చైతన్యకేంద్రం నీలం వర్ణంలో, ఉదరం వద్ద చైతన్యకేంద్రం ఎరుపు వర్ణంలో పదిరేకుల పద్మంలా ఉంటాయి. దానికి పైన హృదయం వద్ద చైతన్యకేంద్రం గులాబి, బంగారు రంగులు కలిసిన ఛాయలో పన్నెండు రేకుల పద్మంలా ఉంటుంది. కంఠం వద్ద చైతన్యకేంద్రం బూడిద రంగులో పదహారు రేకుల పద్మంలా ఉంటుంది.
కనుబొమల మధ్య చైతన్యకేంద్రం తెలుపు వర్ణంలో రెండు రేకుల పద్మంలా ఉంటుంది. తలపై భాగంలో చక్రం స్వర్ణకాంతుల మధ్య నీలిరంగులో వెయ్యిరేకుల పద్మంలా ఉంటుంది.శుక్రవారం మహాలక్ష్మిని పద్మాలతో సేవిస్తే అష్టైశ్వర్యాలు లభిస్తాయని నమ్మకం.
తామరాకు, దుంప, కాడ, పువ్వు వైద్యానికి ఉపయోగం. పద్మకాష్ఠం ఔషధీ విశేషం. తామర తూళ్లు హంసలకు ఆహారం. పద్మకోశం నాట్యంలో ఒక అభినయ హస్తవిశేషం.
మహాభారత యుద్ధంలో ‘పద్మవ్యూహం’ ఉంది. పద్మరాగం జాతిరత్నం. పద్మ నాయకులు మధ్యయుగాల్లో తెలుగుగడ్డపై కొన్ని ప్రాంతాలను పాలించిన ప్రభువులు. పద్మం జ్ఞానవికాసానికి, చైతన్యానికి ప్రతీక. పద్మం మన జాతీయ పుష్పం.
మనకి లక్ష్మీ దేవి పద్మ పీఠం మీద నెలకొని పద్మ హస్తయై కనిపిస్తూ ఉంటుంది.ఇక లలితా త్రిపురసుందరి మహాపద్మాటవి లోనే విహరిస్తుంది.ఐతే ఈ పద్మానికి ఆద్యాత్మిక భౌతిక ప్రాముఖ్యం ఎంతగానో ఉంది.
నిజానికి అసలు ముందు పద్మం పుట్టి సృష్టి తర్వాత జరిగిందని చెప్పుకోవచ్చు.
ఎందుకంటే పురాణయుగంలో శేషతల్పంపైన శయనించిన మహా విష్ణువునాభి కమలం నుంచి ఒక పద్మం అవతరించిందనీ, ఆ పద్మంలో నుండి సృష్టికర్త బ్రహ్మ దేముడు ఆవిర్భ వించాడనీ, అందుకే ఆ సమయంలో ఆ కాలాన్ని పురాణాల్లో "పద్మ కల్పం" అన్నారనీ ఆ పద్మం పేరునే "పద్మ పురాణం" అనీ లోకవిదితం.
అందుకే పద్మం నుంచి పుట్టిన వాడు గనుక బ్రహ్మ "పద్మ సంభవుడుగా పేరుగాంచాడు".ఐతే ఈ పద్మం ఎందరో దేవతలకి ఆసనంగా అందంగా అలరారుతుంది. ముఖ్యంగా స్త్రీల అందచందాలని కవులు "పద్మాక్షి... పద్మనయన... పద్మానన... పాద పద్మాలు" ఇలా వర్ణిస్తూ ఉంటారు. అంతే కాదు,"పద్మినీ జాతిస్త్రీలు" అని ఒక తెగ [నాలుగు జాతుల్లో].
వికసించిన పద్మం జ్ఞనానికి చైతన్య వికాసానికి ప్రతీక ఇక కవుల హృదయాలకి శిరీష కుసుమమే. చైతన్య కేంద్రాలను "చక్రాలు" అంటారు.
ఉదాహరణకు మొదటిదైన మూలాధారం భౌతిక చైతన్యానికి కేంద్రం.ఇది ఎరుపు రంగుతో నాలుగు రేకుల పద్మంలా ఉంటుంది. ఉదరం వద్ద చైతన్య కేంద్రం గాఢమైన ఎరుపు, నీలం రంగు కలిసి ఆరు రేకుల పద్మంలా ఉంటుంది.
ఆ పైన నాభి వద్ద ఊదా రంగులో[చైతన్య కేంద్రం ] పది రేకుల పద్మం లా ఉంటుంది.ఇక కంఠం వద్ద బూడిద రంగులో పదహారు రేకుల పద్మంలా ఉంటే కనుబొమల మధ్య చైతన్యకేంద్రం తెలుపు రంగులో రెండు రేకుల పద్మం లా ఉంటుంది.
చివరిగా తల భాగంలో బంగారు కాంతుల మధ్య నీలి రంగులో వేయి రేకుల పద్మంలా ఉంటుంది.అమ్మవారి నెలవు అదే. కేవలం కావ్యాలలోనే గాక ఆధ్యాత్మిక పరంగా పద్మానికి గల ప్రాముఖ్యత ఎంత గొప్పదో దీన్ని బట్టి విదితమౌతుంది.
ఐతే ఈ పద్మం కేవలం మన దేశానికే కాదు, మన దేశంలోనే దేవతలకు పూజా పుష్పంగా ఆసనంగ కవులకు వర్ణనీయంగా భావించటమే కాదు,ఇతర దేశాల్లో కూడా పద్మ ప్రియులు చాలా చాలా ఉన్నారు.
"జపాన్, చైనా, టిబెట్, ఈజిప్టు" వంటి అనేక చోట్ల ఈపద్మాలు పెరుగుతాయి.
అనాదిగా ఈ పూలు పెరగడమే గాక అతిపవిత్రమైన పుష్పంగా ఆరాధించడం, బౌద్ధ మతంలో కూడా దీన్ని ఆధ్యాత్మికప్రాముఖ్యతతో పూజించడం ఆచారంగా ఉంది.ఈ పద్మాలు చెరువుల్లోను,సరస్సులోను ఎక్కువగా వికసిస్తాయి.ఇంచు మించు ఒకే ఆకారం గల ఈ నీటిపూలను సంస్కృతంలో "పద్మం, కమలం, పంకజం" అని అనేక రకాలుగా పిలుస్తారు.
ఈ పద్మ పత్రాలు గుండ్రంగా ఎనభై సెంటీమీటర్ల చుట్టు కొలతతో నీటి మీద తేలుతున్నట్లుగా వ్యాపించి చెరువంతా గొడుగుల్లా అందంగా కనిపిస్తాయి.ఈపద్మపత్రాల వేళ్ళు తెలుపు లేదా ఎరుపు రంగులో ఉంటాయి.ఇవి ఒకోసారి మీటరు ఎత్తుగా లేదా పదిహేను సెంటీ మీటర్ల వరకు అడ్డంగా విస్తరిస్తాయి.వీటి చుట్టుకొలత ఇంచు మించు తొమ్మిది సెంటీ మీటర్ల వరకు ఉంటుంది.
ఇవి అందానికే కాదు, తినడానికి కూడా ఉపయోగించు కుంటారు.తాజావేళ్ళను వేయించుకుని ఎండ బెట్టిన వేళ్ళను చిన్న చిన్న ముక్కలుగా తరిగి కూరల్లోకి కలుపుకుని తింటారు.చైనా,జపాన్ లాంటి ఇతర దేశాల్లో ఈ వేళ్ళతో ఊరగాయలు పెట్టి శీతాకాలంలో తినడం కద్దు.
ఈ వేళ్ళ నుంచి తయారు చేసే పాలపొడిలో ఎన్నో పోషక విలువలుంటాయి. ఇది చిన్న పిల్లల్లో అతిసారం వంటి వ్యాధులను నివారిస్తుంది.
ఈ వేళ్ళతో తయారు చేసిన పేస్టు చర్మ రోగాల నివారిణి.అంతే కాదు పూల మధ్య లో ఉన్నకర్ణికను ఎండబెట్టి చైనా వారు వాసన కోసం "టీ" లో ఉపయోగిస్తారు. ఇంకా చెప్పాలంటే పద్మాల నుంచి సేకరించిన తేనెలో బలవర్ధక లక్షణాలుంటాయి.
కంటిసమస్యలకు ఈ తేనె బాగా ఉపయోగ పడుతుంది.ఇక విత్తనంలో ఆకుపచ్చ రంగులో ఉండే బీజాకారం చాలా విష పూరితంగా చేదుగా ఉంటుంది.కానీ దాని చుట్టూ ఉన్న తొనల్లో అపారమైన పోషక విలువలుంటాయి,"సి" విటమిన్ ఉంటుంది.ఈజిప్టులో ఈవిత్తనాలను పిండి చేసి పాలతోగాని నీటితోగాని ఆ పిండి తడిపి రొట్టెలు చేసుకుని తింటారట.అంతే కాదు, ఈ విత్తనాలను పచ్చిగా గాని వేయించి గాని ఉడకబెట్టిగాని తినవచ్చు.
సృష్టికి ముందే అవతరించిన ఈ పద్మం కనువిందు చేసే కాంతివంతమైన రూపంతో పాటు దైవికంగా సాహితీ పరంగా ఆధ్యాత్మికంగా భౌతిక చైతన్య కేంద్రంగా ఎన్నో అంద చందాలను సుమ సౌరభాలను విరజిమ్ముతూ ఇన్ని సుగుణాలను కలిగి ఉంది.మనకు ప్రకృతి పరంగా లభించిన వర ప్రసాదం ఈ అందమైన పద్మం.poorna mohan
No comments:
Post a Comment