త్రిపురాంతకం
బాలాత్రిపురసుందరి & త్రిపురాంతకేశ్వరుడు
శక్తిపీఠాలు, నవదుర్గలు, ఊరూరా గ్రామదేవతలు ఇలా జగమే జగన్మాత. జగన్మాత శుంభనిశుంభులను రాక్షసులను సంహరించడానికి తన శరీరంనుండి బ్రహ్మి, మహేశ్వరి, కౌమారి, వైష్ణవి, వారాహి, మహేంద్రి, చాముండ, మహాలక్ష్మి వంటి తొమ్మిది శక్తులను సృష్టించింది. వాటినే నవదుర్గలని దేవీపురాణంలో చెపుతారు. అటువంటి శక్తులలో శ్రీ బాలాత్రిపుర సుందరి కూడా ఒకటి. అటువంటి బాలా త్రిపురసుందరి స్వయంభుగా వెలసిన క్షేత్రము ప్రకాశం జిల్లాలోని త్రిపురాంతకం. శక్తి పీఠమంతటి ప్రాబల్యత కలిగిన క్షేత్రం త్రిపురాంతకం. అక్కడ ఆ తల్లి పిలిస్తే పలుకుతుంది ఆర్తజనులకు ఆర్తిని బాపుతుందని భక్తులు విశ్వసిస్తారు. శ్రీశైలానికి తూర్పు ద్వారంగా విరాజిల్లుతున్న త్రిపురాంతకం క్షేత్రం శైవ, శాక్తేయ ఆలయాల్లో అతి పురాతనమైంది. మార్కాపురం-గుంటూరు మార్గంలో మార్కాపురం నుండి వినుకొండకు ముందుగా త్రిపురాంతకం గ్రామం ఉన్నది.త్రిపురాంతకం గ్రామానికి రెండు కిలో మీటర్ల దూరంలోని కుమారగిరిపై త్రిపురాంతకేశ్వర స్వామి స్వయంభూవుగా వెలిశాడు. ఇక్కడ నుండి సుమారు కిలోమీటరుదూరంలో బాలాత్రిఫురసుందరి ఆలయం కలదు.(మనం ప్రస్తుతం శ్రీబాలాత్రిపుర సుందరి ఆలయం గురుంచి ప్రస్తుతించుకుంటున్నాము. తరువాత త్రిపురాంతకేశ్వరుని ఆలయానికి వద్దాము). ఒక చెరువులోగల ఒక బావి వంటి చిదగ్నిగుండంలో బాలా త్రిపురసుందరీదేవి వెలిసింది. లలితా సహస్ర నామావళిలో అమ్మవారిని కదంబ వనవాసినిగా పిలుస్తారు. ఇక్కడ అమ్మవారి ఆలయం వున్న చెరువుకు ఆనుకుని నాలుగైదు చెరువులు కలవు.
ప్రథమ మూలం (అమ్మవారి నిజమూర్తి) నిర్గుణాకారంలో అమ్మవారు వెనక్కు తిరిగి ఉంటుంది. భక్తుల దర్శనార్థం అమ్మవారికి ముందు మరో విగ్రహాన్ని ప్రతిష్టించారు. అక్కడ చెరువు కట్ట వెంట కదంబ వృక్షములు కలవు. ఇంకను ఆ చెరువు కట్టలపై కదంబం మొక్కలు పుడుతూ ఉంటాయి. ఈ విధమైన కదంబం చెట్లు కాశీలో మాత్రమే ఉన్నట్లు చారిత్రక ఆధారాలు చెబుతున్నాయి. ఇక్కడ ఒకనాడు కదంబ వనమే ఉండెడిది. ఈ కదంబం పూలు చిన్నవిగా కుంకుమ రంగులో పొడవైన సుమారు ఎనిమిది అంగుళముల తొడిమపై గెలల మాదిరిగా ఉండి అటువంటి తొడిమలు వృక్షమునిండా ఉంటాయి.
సాధారణంగా బంతిపువ్వు సైజులో కదంబం పువ్వు చూస్తూ ఉంటాము. అది కదంబకుసుమమే కావచ్చు. కాని అమ్మవారు ఉండే కదంబ వనంలోని కదంబ కుసుమం మాత్రం కచ్చితంగా కాదు (కాదన్నానని అన్యథా భావించవద్దు) నేను ఆ కదంబకుసుమములను అమ్మవారు కొలువు తీరిన కదంబ వృక్షమునకు చూచాను. దురదృష్టవశాత్తు ఆ ఛాయాచిత్రం నావద్ద పోగొట్టుకున్న మొబైల్ లో ఉన్నది.
శ్రీ బాలా త్రిపుర సుందరీ దేవి చిదగ్ని కుండ సంభూత కుమార గిరికి దగ్గరలో ఒకప్పటి చెరువు లో కదంబ వృక్షాల మధ్య శ్రీ బాలా త్రిపుర సుందరీదేవి ఆలయం ఉంది అని చెప్పుకున్నాంకదా! ఈ ఆలయం లో ప్రతిదీ విశేషమైనదే. ఆలయ గోపురం గర్భ గుడిపై నిర్మాణ శైలి వైవిధ్యం తో ఉంటుంది. గర్భ గుడిమీద రాజ గోపురానిని పోలిన గోపురం ఉండటం ప్రత్యేకత. త్రిపురాంతక పీఠేచ దేవి త్రిపురసుందరీ అని శాస్త్రాలలో ఉన్నా ఇది అష్టాదశ శక్తి పీఠంలలో ఒకటిగా గుర్తింపు పొందలేదు. కారణం ఇక్కడ అమ్మవారు స్వయంభుగా ఆవిర్భవించటమే. అమ్మవారు నిర్గుణ శిలా కారం గా ఆవిర్భవించింది. ఇప్పుడున్న గర్భ గృహం త్రిపురసున్దరీదేవి ఆవిర్భవించిన చిదగ్ని కుండం. దీన్ని స్థానికులు ‘’నడబావి ‘’అంటారు. అమ్మవారు ఉత్తరాభి ముఖం గా దర్శన మిస్తుంది. చిదగ్నిగుండం లోకి దిగాలంటే తొమ్మిది మెట్లు దిగి వెళ్ళాలి. ఒక్కో మెట్టూ ఒక్కో ఆవరణ. అదే నవావరణం లో బాలాత్రిపురసుందరి ఉంటుందన్న మాట. ఈ మెట్లకు అధిదేవతా ప్రత్యధి దేవతలుంటారు. తొమ్మిది మెట్లూ దిగిన తర్వాత చిదగ్ని గుండం లో నిర్గుణ శిలకార రూపం లో అమ్మవారు కనిపిస్తుంది. దివ్య చక్షువులున్న మునీశ్వరాదులకు మాత్రం అరుణ కిరణాలతో పుస్తాక్ష మాలా వరదాభయ హస్తాలతో దర్శనమిస్తుంది. సామాన్య జనం కోసం శిల ముందు ఒక విగ్రహాన్ని ప్రతిష్టించారు. ఈ విగ్రహానికి వెనుక ఉన్న శిలమధ్య తెల్లని రాతి మీద శ్రీ బాలా యంత్రం ప్రతిష్టితమై ఉంది. విగ్రహానికి వెనుక రాతి కిరీటం ఉండటం చేత యంత్రం కనిపించదు. అమ్మవారిపై శ్రీ గాడేపల్లి రాఘవ శాస్త్రి గారు – ‘’నూటోక్క శక్తు లెప్పుడు –నాటక మటు లాడు చుండ,నాయక మణియై కూటంబు నేర్పు త్రిపురక –వాటము జొర నంత వాని వశమగు ధాత్రిన్ ‘’అని పద్యం చెప్పారు.
సిద్ధి మండపాలు చిదగ్ని కుండం నుంచి బయటికి వచ్చేటప్పుడు మెట్లకు రెండు వైపులా రెండు మండపాలున్నాయి. వాటినే ‘’సిద్ధి మండపాలు ‘’అంటారు. ఈ మండపాలలో కూర్చుని తదేక దృష్టితో మంత్రం జపిస్తే వెంటనే సిద్ధి కలుగుతుందని తత్వజ్ఞులు చెప్పారు. శ్రీ వావిలాల మహాదేవయ్య గారు ,శ్రీ గోపయ్య గారు ఇక్కడే కూర్చుని మంత్రానుష్ఠానం చేసేవారట.
శ్రీ చక్ర పాదుకలు మెట్లు దాటి బయటికి వస్తే శ్రీ చక్ర మండపం కనిపిస్తుంది. ఇక్కడే శ్రీ చక్ర పాదుకలున్నాయి. అర్చనలన్నీ వీటీకే చేస్తారు. అందరూ వీటిని పూజించ వచ్చు. ఈ చక్ర పాదుకలకు, చిదగ్నికుండ దేవికి తంత్ర సంబంధ అను సంధానం ఉంది. ధనం కావాలంటే ఎరుపు రంగు విద్య కావాలంటే తెలుపు ,శత్రు జయం కలగాలంటే నల్లని స్వరూపంతో అమ్మవారిని ధ్యానించాలి. ఈ పాదుకల వెనుక సిద్దేశ్వర పాదుకలుంటాయి. వీటిని ‘’గురుపాదాలు ‘’అంటారు. శ్రీ విద్యా సాంప్రదాయం లో వీటి ప్రాధాన్యం ఎక్కువ. గురుపాదుకలకు ప్రక్కనే బ్రాహ్మీ లిపి లో ‘’గురుపాదకా మంత్రం ఉంది’’. చక్ర మండలం నైరుతి భాగం లో శ్రీ దక్షిణా మూర్తి లింగం ఉంది .స్వామికి ఇక్కడే అభిషేకం చేస్తారు.
ఛిన్నమస్తా దేవి చక్ర మండపం దాటి ఉత్తర ద్వారం గుండా బయటికి వస్తే ‘’ఛిన్న మస్తా దేవి’’ చిన్న మండపం లో కనిపిస్తుంది. ఈమెనే ప్రచండ చండిక అని, వజ్ర వైరోచని అని అంటారు. ఈమెయే అమ్మవారి సర్వ సైన్యాధ్యక్షురాలు. ఈమె దశ మహా విద్యలలో ఆరవ మహా విద్య. ఈమెను ఉపాసిస్తే కలిగే ఫలితం ‘’యామళం’’అనే గ్రంథం, వివరించింది. ఆలయం బయట చతుషష్టియోగినీ మూర్తులు దర్శన మిస్తారు. ఇవి ఇప్పుడు నిజంగా ఛిన్న మస్తకాలై రూపు చెడి గోడలకు నిలబెట్ట బడి ఉన్నాయి.
రక్త పాత్రలు సాధారణం గా శక్తి ఆలయాలలో సింహవాహనం ధ్వజస్తంభం ఉండాలి. ఈ రెండు ఇక్కడ లేవు. కనుక అమ్మవారు మానవ ప్రతిష్టితం కాదని , స్వయంభు అని భావిస్తారు. వైదికాచారులే కాక వామాచారులకు కూడా ఈ అమ్మవారు ఉపాస్య దేవత. ’’సవ్యాప సవ్య మార్గస్థా’’. ఒక్కప్పుడు ఈ ఆలయం లో ‘’పంచ మకారార్చన’’జరిగేది. అందుకే గర్భాలయం లో రాతి తో చేయబడిన ‘’రక్త పాత్ర ‘’ఉంది. దీనికి ‘’ఉగ్రపాత్ర ‘’అనే పేరుకూడా ఉంది. ఉగ్రపాత్ర అర అడుగు ఎత్తు, రెండడుగుల వ్యాసం కలిగి ఉంటుంది. ఎన్ని దున్నల్ని బలిచ్చినా, ఒక్కో పొతూరక్తానికి కడివెడు నీళ్ళు పోసినా ఆ రక్త పాత్ర నిండదు. ఈ విషయం ఈ నాటికీ ప్రత్యక్ష నిదర్శనమే ఈశాన్యం లో మామూలు భక్తులు వేరొక రక్త పాత్ర ఉన్నది. దానికి రెండు అడుగుల దూరం లో బలిని ఇచ్చే ‘’యూప స్థంభం ‘’కూడా ఉంది. దీనిపై సంస్కృత శాసనం ఉంది. శాక్తేయ చిహ్నాలైన త్రిశూలం దానికి రెండు వైపులా సూర్య చంద్రులు ఉన్నారు.
దీన్ని ఒక కవి పద్యం లో ‘’మదపు టేనుగు నైన, కొదమ సింగంబైన –యూప శిలకు, సమీప మందు– మెడ యెసంగి నిలుచు మేకపోతులు దున్న –లేమి చెప్ప జూతు నామే మ్రోల ‘’ వ్యాస భగవానుడు ఈ అమ్మవారిని ‘’దేవతాగ్రణీ’’ అని స్తుతించారు స్కాంద పురాణం శ్రీశైల ఖండం లో- ‘’గిరి ప్రదక్షిణం కుర్యాత్ చతుర్భైరవ సంయుతం –త్రైలోక్య జననీ సాక్షాత్ త్రిపురా దేవతాగ్రణీ దృష్ట్వా ప్రయత్నతో దేవీ మర్చయిత్వా సమంత్రకం ‘’
కదంబ వనవాసిని త్రిపురసుందరీ దేవి స్థావరం కదంబ వనం .ఈ వనాలు ఆలయం దగ్గరే ఉన్నాయి. అతి సున్నితంగా రక్త వర్ణం తో ఉండే కదంబ పుష్పాలు అమ్మవారికి మహా ప్రీతి. అందుకే ‘’కదంబ కుసుమ ప్రియాయై నమః ‘’అని లలితా సహస్రం లో చెప్పారు. కదంబ వృక్షాలే కల్ప వృక్షాలని శ్రీ శంకర భగవద్పాదులు తెలియ జేశారు. ’’కదంబ కాననావాసా ‘’-కదంబ నామా కల్ప వృక్ష యుక్తం యత్కాననం వనం తత్ర గృహం యస్యాః సా తదా ‘’అని భాష్యం చెప్పారు.
వీర శిలలు అమ్మవారి ఉత్తర ద్వారం కు ఎదురుగా ఉన్న శిల్పాలన్నీ వీర శిలలే. ఇవి భక్తుల వీర కృత్యాలకు ప్రతి బింబాలు. ఒకప్పుడు ఆ వీరులకు ఇక్కడ ఆరాధన జరిగేది. ఇందులో అధికభాగం స్త్రీ శిల్పాలే .వివిధ ఆలం కారాలతో కేశ పాశాలతో వీరులు బల్లాలను తలలో, గుండెలో, గొంతులో, తొడలలో పొడుచుకొంటూ ఇంకా బ్రతికే ఉన్నట్లు కనిపిస్తారు. వీరు ఎందుకు వీరకృత్యాలు చేశారో తెలిపే శాసనాలున్నాయి. ’’స్వస్తిశ్రీ సోమతుశివ దేవా గురు అల్లడ్డ వీర మల్లునికి మేలుగావలెన్ అని తల త్రిపురా దేవి కిన్ ఇచ్చే ‘’ అని ఒక శాసనం. ఇంకోదానిపై ‘’దేవికి తల ఇస్తున్నాను తెలుంగు నాయని బావ మరది చావుండయ్య వీర’’అని అసంపూర్తి శాసనం కనిపిస్తాయి. ఇలా ఆత్మార్పణ చేస్తే దేవి కోరికలు తీరుస్తుందని నమ్మకం.
అపరాదేశ్వరీ ఆలయం –గుహలు అమ్మవారి ఆలయానికి దగ్గరలో బయట రోడ్డుమీద ‘’అపరాదేశ్వరీ ‘’లేక బాలమ్మ ఆలయం ఉంది. ఇది శిధిల రూపం లోనే ఉంది. దీనికి దగ్గరలో చింతామణి గుహ ,ఉన్నది. ఇది అమ్మవారి ఆలయమే నని భావన ఆధారం ‘’చింతామణి గుహాంతస్థ‘’ అనే నామం. ఇక్కడే పూర్వం లక్ష్మీ గణపతి ఆలయం ఉండేదట. అమ్మవారికి వెనక వైడూర్య శిఖరం అనే కొండ మీద ధ్యానం చేస్తే రోగాలన్నీ మాయమవుతాయట. ఇకడే తమాషా అయిన తెల్లని రాతి వరుస ఉందట. దీని రహస్యం సిద్ధులకు మాత్రమె ఎరుక.
మహా సర్పం –మరికొన్ని విశేషాలు బాలా త్రిపుర సుందరీ దేవి ఆలయం చెరువు కట్టపై ఒక పుట్ట ఉంది. అందులో విశేషమైన సర్పం ఒకటి ఉంటుంది. సంతానార్ధులు ,నాగ దోషమున్నవారు ,ఈ పుట్టకు పొంగళ్ళు సమర్పిస్తారు ఇందులోని పాము రాత్రి వేళ అమ్మవారి చిదగ్ని గుండం చేరి సేవ చేసి తిరిగి వస్తుందట.
కుమారగిరి
శైవ శాక్తేయ క్షేత్రాలలో అత్యంత ప్రాధాన్యం పొందిన మహామహిమాన్విత దివ్య క్షేత్రం త్రిపురాంతకం స్కాంద పురాణం లో శ్రీశైలఖండం లో త్రైలోక్య పావనం తీర్ధం త్రిపురాంతక ముత్తమం అని చెప్ప బడిన అతి ప్రాచీన క్షేత్రం. మార్కాపురానికి నలభై కిలో మీటర్ల దూరం లో ,గుంటూరు –కర్నూలు మార్గం లో రహదారికి రెండు కిలో మీటర్ల దూరం లో ఉన్నది. త్రిపురాంతకం సిద్ధ క్షేత్రం. అనేక యోగులు ,సిద్ధులు తాన్త్రికులకు ఆవాస భూమి .అనేక దివ్యమైన ఔషధాల నిలయం. రస రత్నాకర ,నాగార్జున సిద్ధ తంత్రం మొదలైన గ్రంధాలు దీని ప్రాభవాన్ని తెలియ జేశాయి. స్వామి ధ్వజస్తంభాన్ని చూసినా పాపాలు పటాపంచలౌతాయి. ఈ దైవ దర్శనం చేస్తే నంది జన్మ లభిస్తుందని విశ్వాసం. త్రిపురాంతక నామ స్మరణం ముక్తిదాయకం అని పార్వతీదేవికి స్వయంగా ఆ పరమ శివుడే చెప్పాడు .త్రిపురాంతక లింగాన్ని తత్పురుష లింగం అంటారు.
స్థల పురాణం
త్రిపురాసుర సంహారం తారాకాసురుడు పూర్వం దేవ, ఋషులను బాధిస్తుంటే శివ కుమారుడైన కుమారస్వామి తారాకాసురుని మెడలోని ప్రాణ లింగాన్ని ఛేదించి వాడిని సంహరించాడు. ఈ యుద్ధం లో అలసిన శరవణ భవుడు ‘ఆదిశైలం అనే పేరున్న ఈ పర్వతం పై విహరించటం వలన కుమార గిరి అనే పేరొచ్చింది .తారకాసురుని ముగ్గురు కొడుకులు తారాక్షుడు ,విద్యున్మాలి ,కమలాక్షుడు. వీరినే త్రిపురాసురులు అంటారు. తండ్రి మరణానికి ప్రతీకారం తీర్చుకోవటానికి ఈ ముగ్గురు మూర్ఖులు శుక్రాచార్య అనుజ్ఞతో బ్రహ్మ కోసం ఘోర తపస్సు చేశారు. ఆయన ప్రత్యక్షం కాలేదు. పంతం పెరిగి ఒంటికాలి మీద నిలిచి తీవ్ర తపస్సు చేస్తే లోకాలు తల్లడిల్లిపోయాయి. బ్రహ్మ ప్రత్యక్షమై వరం కోరుకో మన్నాదు .ఎవరి చేతిలోనూ చావు కలగ కూడదని వరం కోరుకొన్నారు. పుట్టిన వాడు చావాల్సిందే కనుక ఎలా చావాలనుకోన్నారో చెప్పండి అని అడిగాడు. తాము ఆకాశం లోమూడు పురాలను కట్టుకొని వెయ్యేళ్ళు జీవించిన తర్వాత ఆ మూడు పురాలు వరుసగా ఒకే చోట చేరినప్పుడు ఒకే బాణంతో ఆ త్రిపురాలను ఛేదించిన వాని చేతిలోనే తమకు మృత్యువు రావాలని కోరుకొన్నారు. సరే నన్నాడు బ్రహ్మ. తారాక్షుడు బంగారం, విద్యున్మాలి వెండితో, కమలాక్షుడు ఇనుముతో చేయబడిన పురాలను కట్టుకొని ఉంటూ దేవతలను మునులను బాధించేవారు. వారు పరమేశ్వరుని ప్రార్ధించారు .అప్పుడాయన త్రిపురాసురలను చంపాలంటే అపూర్వమైన రథం, అపూర్వమైన బాణాలు అవసరమనీ చెప్పాడు. వీరు శ్రీహరిని ప్రార్ధిస్తే ఆయన విశ్వకర్మకు ఆదేశం ఇచ్చి అపూర్వ బాణాలను సృష్టింప జేశాడు. విశ్వకర్మ జగత్తు తత్త్వంతో రథాన్ని, వేద తత్త్వంతో గుర్రాలను, నాగ తత్త్వంతో పగ్గాలను, మేరు శిఖర తత్త్వంతో ధనుస్సును, వాసుకి తత్త్వంతో వింటినారిని, సోమ,విష్ణు, వాయు తత్త్వాలతో బాణాలను తయారు చేసి ఇచ్చాడు. బ్రహ్మ రథసారధి అయ్యాడు. అ దివ్య రథాన్ని చూసి సంతసించి శివుడు అధిరోహించి త్రిపురాసుర సంహారానికి బయల్దేరాడు.
త్రిపురాంతకేశ్వర ఆవిర్భావం ఇంత చేసినా త్రిపురాసురుల తపో బలం వలన, మయుడి నిశ్చల తత్త్వం వలన ఆ దివ్య రథం భూమి లోకి క్రుంగి పోయింది .గుర్రాలు నిలువ లేకపోయినవి. ధనుస్సు పని చేయలేదు. రుద్రుడు విశ్వకర్మను పిలిచి సమర్థమైన రథం నిర్మించ లేక పోయినందుకు కోప పడ్డాడు. ఆయన సిగ్గుతో తల వంచుకొని వెళ్ళిపోయాడు. పరమేశ్వరుడు అంతర్ముఖుడైనాడు .పర దేవతను ఆత్మలో ధ్యానించాడు. లీలా వినోదిని పరమేశ్వరి బాలాత్రిపురాసుందరిగా ఆవిర్భవించింది. శివుని ధనుస్సులో ప్రవేశించింది .దీనికి ఋగ్వేదంలో ఒక మంత్రం సాక్షిగా కనిపిస్తుంది. అహం రుద్రాయ ధనురా తనోమి బ్రహ్మ ద్విషే శరవే హంత వా ఉ| అహం జనాయ సమదం క్రుణోమ్య హం ద్యావా ప్రుథివీ ఆవివేశ, .అమ్మవారి తోడ్పాటుతో రుద్రుడు బాణం యెక్కు పెట్టాడు. దేవతలు అప్పుడు నమస్తే రుద్ర మన్యవ ఉతోత ఇషవే నమః ‘అని స్తుతించారు. త్రిపురాలన్నీ ఒకే సరళ రేఖలో చేరాయి. రుద్ర బాణం తో అవి ఒకే సారి ద్వంసమైనాయి. దేవమునులు సంతసించారు. బాలా త్రిపుర సుందరి ధనుస్సు నుంచి బయటికి వచ్చింది. శివుడు ఆమె సాయాన్ని ప్రస్తుతించాడు. ఆమె కృతజ్ఞతతో త్రిపురాసుర సంహారం చేసిన రుద్రుడు ఎక్కడ ఉంటె తానూ ఆక్కడే ఉండి ఆయన్ను సేవిస్తాను అని ఆయన అనుగ్రహాన్ని కోరింది. రుద్రుడు వెంటనే సమాధి స్థితిలోకి వెళ్ళాడు. ఆయన పాదాల దగ్గర ఉన్న స్థలం ద్రవించటం ప్రారంభించింది . పెద్ద గుంట ఏర్పడి నీరు లోపలి పొరల్లోకి ప్రసరించింది ఆ గుంటలోనే ఆయన వైఢూర్య లింగం గా ఆవిర్భవించాడు. దీనికి సాక్ష్యం గా వేదమంత్రం ఉంది –స్తుతి శ్రుతం గర్త సదం యువానం
మృగన్నభీమ ముప హత్తు ముగ్రం
–మ్రుడా జరిత్రే రుద్రస్తవానో -అన్యంతో అస్మిన్ని వపంతు సేనా’ వైడూర్య లింగానికి పై భాగాన బ్రహ్మ దివ్య జల లింగాన్ని ప్రతిస్టించాడు. ఇక్కడ జలలిన్గానికి చేసిన అభిషేక ద్రవ్యం లోని ద్రవ్య చిత్త దోషాలు పై భాగం లోనే లయమై లోపల ఉన్న త్రిపురాన్తకేశ్వరుని చేరుతుంది.
త్రిపురాంతకేశ్వరుడు ఆవిర్భవించిన ఈ దివ్య ప్రదేశమే కుమార గిరి. ఆదిశైలం, అరుణాచలం, కుమారాచలం, లేబ్రాయపు కొండ అని పేర్లున్నాయి. తారకాసుర సంహారం చేసిన తర్వాత నుండి కుమార స్వామి ఇక్కడ రహస్య ప్రదేశం లో తపస్సు చేస్తున్నాడు. ప్రతి పౌర్ణమి నాడు పార్వతీ దేవి ,ప్రతి అమావాస్య రోజున పరమేశ్వరుడు వచ్చి తమ కుమారుడైన కుమారస్వామిని చూసి పోతూ ఉంటారని శివ పురాణం లోని శ్లోకం తెలియ జేస్తోంది – అమావాస్య దినే శంభుఃస్వయం గచ్చతి తర –పౌర్ణమాసీ దినే పార్వతీ గచ్చతి ధృవం
పిలిస్తే పలికే దైవం పూర్వం త్రిపురాన్తకేశ్వరుడు పిలిస్తే పలికే వాడట. పాల్కురికి సోమనాధుడు బసవ పురాణం లో చెప్పిన కిన్నెర బ్రహ్మయ కథ తార్కాణం. ఈ ఆలయానికి నాలుగు వైపులా నాలుగు ప్రధాన ద్వారాలున్నాయి నాలుగు వైపులా కొండ పైకి మెట్ల మార్గాలున్నాయి. ఇప్పుడు తూర్పు ద్వారం ఒకటే తెరచియున్నది. దక్షిణ సోపాన మార్గానికి దగ్గర మూలస్థానేశ్వర స్వామి దేవాలయం ఉంది. ఈయన మహా మహిమ కల దైవం. అనేకమంది రాజులు ఈయనకు భూరి దానాలు సమర్పించారు. దీనికి దగ్గరలో శ్రీ లక్ష్మీ చెన్న కేశవాలయం ఉన్నది. పలనాటి బ్రహ్మనాయుడు ఈ స్వామిని అర్చించాడు. మూల స్తానేశ్వరునికి ఆగ్నేయంగా పంచ బ్రాహ్మలచే ప్రతిష్టింప బడిన పంచ లింగ దేవాలయం ఉన్నది. ఈశాన్యం లో ఆవు పొదుగు ఆకారం తో లింగాలు దర్శన మిస్తాయి. పూజిస్తే ఆయురారోగ్యాలనిస్తాయి. దక్షిణ సోపానాల దగ్గర వీర భద్రాలయం ఉంది. ఇంకొంచెం పైకి ఎక్కితే ఇష్టకామేశ్వారీ దేవాలయం ఉన్నది. దీనికి దక్షిణంగా అద్భుత మహిమలున్న అగస్త్య లింగం ఉన్నది. దీనినే విన్ధ్యేశ్వర లింగం అని అంటారు. ముఖ్యదేవాలయం దగ్గరే అపరాజితేశ్వరుడు ఉన్నాడు. మన్యు సూక్తంతో అర్చిస్తే శత్రుజయం లభిస్తుంది. ఆగ్నేయంలో సూక్ష్మ తేజోమయ యజ్ఞేశ్వర లింగం వాయువ్యంలో హనుమంతుడు నెలకొల్పిన మారుతి లింగం ఉన్నాయి వీటిని పూజిస్తే ఆయుష్షు బలం యశస్సులు కలుగుతాయి. వీటి ప్రక్కనే మార్కండేయ ప్రతిష్టిత దివ్య లింగం ఉంది. ఉత్తరంలో చండీశ్వరుడు, పార్వతీ ఆలయానికి ఎదురుగా విశ్వామిత్ర ప్రతిష్టితమైన ఉగ్రేశ లింగం ఉన్నాయి. ఉత్తర గోపురం దగ్గర గొప్ప శిల్పకళాశోభితమైన మహిషాసుర మర్దిని విగ్రహం ఉండేది. ఇప్పుడు అది మద్రాస్ మ్యూజియం లో ఉంది. గర్భాలయానికి నైరుతి దిశలో చీకటి మిద్దె అనే చీకటి గుహ ఉన్నది. ఇక్కడి నుంచి కాశీ ,శ్రీశైలాలకు సొరంగ మార్గం ఉంది. వృశ్చిక మల్లేశ్వరాలయానికి దగ్గరలో మఠం ఉంది. శ్రీ బాలా త్రిపుర సుందరిని అర్చించడానికి సిద్ధ సాధ్యులు ఈ మార్గం ద్వారా వస్తారని చెబుతారు. ప్రధాన ఆలయానికి ఉత్తరాన ఒక చింత చెట్టు ఉండేది. దాని మూలం లో భైరవుడు ఉంటాడు. దాని ముందు మనిషి లోతు త్రవ్వితే ఒక గుండం కనబడుతుంది. అప్పుడు చింత చెట్టు ఆకులు కోసి గుడ్డలో మూట కట్టి ఆ గుండం లో వేస్తె రాళ్ళు చేపలుగా మారుతాయట. ఆ చేపలను వండి తలను తోకను తీసేసి తింటే మూర్చ వచ్చి కొంత సేపటికి లేస్తాడు. ఆ మనిషి వేల సంవత్సరాలు జీవిస్తాడని నిత్య నాథ సిద్ధుడు అనే యోగి
రస రత్నాకరం అనే గ్రంథంలో రాశాడు. చీకటి మిద్దె ప్రక్కనే మహా గణపతి మండపం ఉంది. విగ్రహం శిథిలమైతే ప్రక్కన కింద పెట్టారు. ప్రధానాలయం శ్రీ చక్రాకారం లో నిర్మించ బడింది. శివాలయం ఈ ఆకారం లో నిర్మించటం చాలా అరుదు. అలాటి అరుడైన దేవాలయం ఇది. శ్రీ చక్రం శివ యొర్వపుః’అంటే శివ పార్వతుల శరీరమే శ్రీ చక్రం. స్వామి ఉగ్రరూపం కనుక తూర్పు గ్రామాలు తగలబడి పోయాయట. అందుకే ఆ ద్వారాన్ని మూసేశారు .పక్కగా ఉన్న దారి గుండా వెళ్లి దర్శనం చేసుకోవాలి. లోపల స్వామికి ఎదురుగా నందీశ్వరుడు ఆకర్షణీయం గా ఉంటాడు. జల లింగాన్ని దుండగులు పీకేస్తే కొండ కింద ఉన్న శ్రీరామ ప్రతిష్టిత లింగాన్ని తెచ్చి ప్రతిష్టించారు .పునః ప్రతిష్టలో మూల విరాట్ ను కదిలించకుండా మూల విరాట్ కు కింద మరొక నర్మదా బాణ లింగాన్ని ప్రతిష్టించారు. త్రిపురాన్తకేశ్వరునికి ఉత్తరాన పార్వతీ దేవి అంటే స్కంద మాత ఆలయమున్నది. పై రెండు చేతులలో శాక్తేయ చిహ్నాలైన త్రిశూలం ,డమరుం కింది చేతులలో పద్మాలు కలిగి ఉంటుంది. అమ్మవారి ముందు కాశీ విశ్వేశ్వర లింగం ఉంది . స్వామి అభిషేకాలకు భక్తజనం త్రాగటానికి గంధవతి తీర్ధం ఉంది. ఇందులో స్నానంచేస్తే పుణ్యం మోక్షం .బాలాత్రిపుర సుందరి ఆలయం వెనక పుష్పవతీ తీర్ధం ఉండేది. చెరువులో కలిసిపోయింది. మహా నందిలో లాగానే ఇక్కడ కూడా స్వచ్చమైన జలం తో ఉండే కోనేరుండేది. దీనికి పాప నాశనం ‘అనిపేరు. నాలుగు కొండల మధ్య ఉన్న సోమ తీర్ధం పాప నాశిని. కుమార గిరికి పడమర దూర్వాస నది లేక దువ్వలేరు ఉన్నది. ఇక్కడ దూర్వాసుడు తపస్సుచేశాడు. దీనికి దక్షిణం లో ముక్త గుండం లో స్నానం చేస్తే మోక్షమే.
తీర్దాలు-మిగిలిన గుడులు త్రిపురాంతకం అష్ట భైరవ పరి వేష్టితం. కుమార గిరికి దక్షిణాన భైరవగిరి సిద్ధులకు సిద్ధి క్షేత్రం. పూర్వం ఇక్కడ భైరవాలయం ఉండేది. తూర్పున శ్రీ సుందరేశ్వర స్వామి కొండపై ఉన్నాడు. పడమరలో శ్రీ రామ నిథేశ్వరుడు మిక్కిలి పూజ నీయుడు. ఉత్తరాన ఉన్న కొండను పూలకొండ అంటారు. ఇక్కడే తారకాసురుడు పూజించిన శివ లింగం ఉంది. ఇక్కడే తారకాసుర మందిరం ఉండేదట. దక్షిణాన కొండమీద విద్యున్మాలి పూజించిన లింగం ఉంది. దీనికి దిగువన ఓషధీ సమన్విత సోమ తీర్ధం ఉంది. ఇది సర్వ రోగ నివారిణి. తూర్పున పంచ బ్రహ్మలు ప్రతిష్టించిన పంచ లింగాలున్నాయి. వాయవ్యం లో లింగాల కొండ ఉంది. ఇక్కడ వెయ్యి నూట ఒక్క లింగాలు ఉన్నాయట. ఇక్కడ అజ్ఞాతం గా మునులు తపస్సు చేస్తూ ఉంటారట. ఇకడే దివ్యౌ షది సంజీవిని ఉన్నాడని జ్ఞానులు చెబుతారు.
కుమారగిరిపై త్రిపురాంతకేశ్వర స్వామి స్వయంభూవుగా వెలిశాడు. ప్రపంచంలో ఏ ఆలయంలోకి ప్రవేశించాలన్నా తూర్పు, ఉత్తర ద్వారాల ద్వారా దర్శనానికి వెళతారు. ఇది రాక్షస ఆగమన ప్రకారం నిర్మించడంతో దక్షిణ ద్వారం(నైరుతి ప్రవేశం) నుంచి ఆలయంలోనికి ప్రవేశం ఉంటుంది. శ్రీచక్ర ఆకారంలో శక్తి పీఠాల ఆలయాలను నిర్మిస్తుండటం ఆనవాయితీ కాగా త్రిపురాంతకేశ్వరుని ఆలయం శ్రీచక్ర పీఠంపై నిర్మితం కావడం చేత ఆలయానికి ప్రత్యేక విశిష్టత సంతరించుకుంది. వైష్ణవ, శివ ఆచారాల మేళవింపు కలిగిన ఈ ఆలయం శ్రీశైల ఆలయాల కంటే అతి ప్రాచీనమైంది. స్వామి ద్వారం వద్ద ఉన్న ద్వారపాలకులైన భద్రుడు, వీరభద్రుడు శిల్ప నైపుణ్యతకు పెట్టింది పేరు. స్వామికి ఉత్తర వైపుగా సిద్ధేశ్వరి తల్లి ఢమరుకం చేత పూని భక్తులకు దర్శనమిస్తుంది. ఇక్కడ నుంచి శ్రీశైలానికి వెళ్లేందుకు బిల మార్గం ఉంది. పూర్వం మునులు ఈ దారినే వినియోగించినట్లు వేదాల్లో పేర్కొన్నారు. ఎటు చూసినా శిల్ప సంపదే ఏడో శతాబ్ధంలోని కాకతీయుల కాలంలో నిర్మాణం జరిగిన అతి ప్రాచీన ఆలయం త్రిపురాంతక క్షేత్రం. ఆలయ పరిసరాల్లో శిల్ప సంపద శోభాయమానంగా దర్శనమిస్తుంది. ఆలయానికి వేసిన రంగులను ఇటీవల తొలగిస్తుండటంతో సహజత్వం కలిగిన శిల్ప సంపదతో పాటు గోడలపై శాసనాలు కనిపిస్తున్నాయి. పాపనాశనం, అంగారేశ్వర, మూల స్థానేశ్వర, సోమేశ్వర, ఖడ్గేశ్వర, కన్యసిద్ధేశ్వర, కేదారేశ్వర, మల్లిఖార్జున, కపిలేశ్వర, గౌరేశ్వర, ఉత్తరేశ్వర, ఏకాదశ రుద్ర స్థానాల మధ్య త్రిపురాంతకేశ్వరుడు స్వయంభూగా వెలిశాడు. ఈ ఆలయానికి నాలుగు వైపుల ఉన్న సోపానాలు నేడు కనుమరుగయ్యాయి.
బిలాలు శివాలయానికి ఉత్తరాన ‘’కోకిలా బిలం ‘’ఉంది. సాధకుడు శుచిగా అందులో ప్రవేశించాలి. నలభై అడుగులు లొపలికి వెడితే కోకిల ఆకారపు రాళ్ళు కనిపిస్తాయి. ఆ రాళ్ళను తీసుకొని వాటి వెనక నువ్వులు పెడితే అవిపగిలిపోతాయి. అప్పుడు ఆ రాళ్ళను పాలలో వేస్తె పాలు నల్లగా మారుతాయి. ఈ పాలను గొంతు నిండే దాకా తాగాలి. అప్పుడు దివ్య శరీరం పొంది తెల్లజుట్టు ముడుతలు పోయి ,రోగాలు లేనివాడై మూడు బ్రహ్మ దినాలు జీవిస్తాడు. మహా బలవంతుడై వాయువేగం కలుగుతుందని చెపుతారు.
గుండ్ల కమ్మ నదికి తూర్పు కొండపై చంద్ర మౌళీశ్వరాలయం ఉంది. దాని దగ్గరేకాశి కేశుడు ,ఒక కోనేరు ,నృసింహ బిలం ఉన్నాయి. బిలం లో ప్రవేశిస్తే యోగసిద్ధి కలుగుతుంది. దానిలో నుంచి కాశీ వెళ్ళచ్చు.
వీరశైవం –మఠాలు త్రిపురాంతకం శైవమత వ్యాప్తికి దోహద పడింది. ఇక్కడి ‘’గోళకీ మఠం’’ప్రసిద్ధి చెందింది. 14వ శతాబ్దం లో వీర శైవం విజ్రుమ్భించింది. 1312నాటికి పూజారులు 72నియోగాల వారు స్తానాదిపతుశ్రీ అసంఖ్యాత మహా మహేశ్వరులకు లోబడి ఉండాలన్న నిబంధన ఏర్పడింది. ఇక్కడి ‘’విశుద్ధ శైవ మఠం’’ఉచిత అన్న వస్త్రాలిచ్చి వేదం వేదాంగాలు శాస్త్రాలు సాహిత్యం బోధించింది. పదమూడు పద్నాలుగు శతాబ్దాల మధ్య ‘’కాపాలిక మతం ‘’అభి వృద్ధి చెందింది. అప్పుడే ‘’పంచ మకారార్చన ‘’జరిగేది (మద్యం మాంసం మగువ ).
ఉత్సవాలు ప్రతి సోమ ,శుక్రవారాలలో విశేష ఉత్స్సవాలు మహా శివరాత్రి నాడు కల్యాణోత్సవం జరిగేదని వసంత నవరాత్రులు ,శరన్నవ రాత్రులు శ్రావణ మాసంలో ఉత్సవాలు కార్తీకంలో అభషేకాలు సంతర్పణలు జరిగేవని శాసనాల వలన తెలుస్తోంది. తర్వాత ఆలయం శిథిలా వస్తకు చేరింది. శ్రీశైలం దేవస్థానం ఈ క్షేత్రాన్ని దత్తతకు తీసుకోని పునరుద్ధ రించి మళ్ళీ నిత్య ధూప దీప నైవేద్యాలు ఉత్సవాలు నిర్వహింప జేస్తోంది. దాతలు ముందుకు వచ్చి అన్నదాన సత్రాలు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం కార్యనిర్వాహణ అధికారి మరియు ఇతర సిబ్బంది మహాశివరాత్రిని అద్భుతంగా నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. అన్ని వర్గాల వారు మూడు రోజుల పాటు అన్న దాన సత్రాలు వసతి సముదాయలు నిర్వహిస్తున్నారు. మూడో రోజు స్వామి వారి రథోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇంతటి మహా మహిమాన్విత దివ్య క్షేత్రమైన త్రిపురాంతకం మహా శివరాత్రి నాడు వెళ్లి శ్రీ బాలా త్రిపుర సుందరిని, శ్రీ త్రిపురాంత కేశ్వరుని దర్శించి జీవితాలను చరితార్ధం చేసుకోవాలి
బాలాత్రిపుర సుందరి సన్నిధిలో శుభకార్యములు గాని, పితృకార్యములు గాని నిర్వహించుకొనుటకు వసతి సౌకర్యముతో సహా సౌకర్యము గలదు.
త్రిపురాంతకంలో శ్రీశైలంవారి కరివెన వారి సత్రం (కేవలం బ్రాహ్మణులకు మాత్రమే), మరియు ఇతర బ్రాహ్మణ సత్రములు, ఇంకను ఇతర సామాజికవర్గముల వారికి సత్రములు కలవు
No comments:
Post a Comment