మహేశుడి నెలవు... దేవేంద్రుడి కొలువు
పారిజాతాలు...నందనవనాలు
దేవగానాలు...గంధర్వ లోకాలు
మానస సరోవరాలు...రాజహంసలు.
యతుల నివాసాలు... మునుల గుహాలయాలు
అక్షయ నిధులు... ఆత్మానందాలు...
అన్నీ అక్కడే. అవి హిమాలయాలు...
అవి అచలాలైనా చంచలమైన మనస్సును అదుపు చేసుకోవాలనుకునే వారి చరమ లక్ష్యాలు. ఆత్మోన్నతి కోరుకునేవారికి కొంగుబంగారాలు. భారతీయ ఆధ్యాత్మికతకు పెట్టని కోటలు. అచట పుట్టిన కొమ్మ కూడా ్ఝ]చేవ అన్నట్లు అక్కడ కనిపించే ప్రతి దృశ్యమూ అద్భుతమే.
ఆ సానువల్లో పుట్టిన ప్రతి కథా ఆశ్చర్యమే.
శివ, బ్రహ్మవైవర్త, మత్స్యపురాణాల్లో హిమాలయాలు, అక్కడి ప్రాంతాలు, శిఖరాలకు సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన సంగతులు కనిపిస్తాయి
ప ర్వతాలకు రెండు రకాల దేహాలుంటాయని సనాతన ధర్మం చెబుతోంది. ఒకటి జంగమం... అంటే నడిచేది. రెండోది స్థావరం... అంటే స్థిరమైంది. శివపురాణంలోని పార్వతీ ఖండంలో ఉన్న కథ ప్రకారం హిమవాన్ అనే పర్వతరాజు ఉండేవాడు. ఆయననే హిమవంతుడని కూడా పిలిచేవారు. ఆయన స్థావర రూపంలో అంటే పర్వతంగా ఉన్నప్పుడు తూర్పు నుంచి పడమరకు భూమిని కొలిచే కొలబద్దలా వ్యాపించి ఉండేవాడు. అద్భుత ప్రకృతి సౌందర్యంతో శోభాయమానంగా దర్శనమిచ్చేవాడు. అందుకే ఎందరో రుషులు అక్కడ తపస్సు చేసుకునేవారు. హిమవంతుడు విష్ణువు అంశతో జన్మించినవాడు. అందుకే ఆయనను, ఆయన స్ధావర రూపమైన హిమాలయాలను పరమశివుడు అత్యంత ఇష్టపడేవాడు. హిమవంతుడికి మేన అనే ఆమెతో వివాహమైంది. వారిద్దరి సంతానమైన పార్వతీదేవినే పరమశివుడు పెళ్లి చేసుకుని హిమశిఖరాలపైనే తన నివాసాన్ని ఏర్పాటు చేసుకున్నట్లు శివ పురాణం చెబుతుంది.
పరమేశ్వరుడు కొలువున్న ఆ చోటే కైలాస పర్వతమని చెబుతారు. ఉత్తర హిమాలయాల్లోని ఈ దివ్యధామం మహిమాన్వితమైంది. భారతీయులతో పాటు, టిబెట్, నేపాల్ ప్రజలకు కూడా అత్యంత పూజనీయస్థలమది. ఈ పర్వత వైభవాన్ని బ్రహ్మవైవర్త పురాణం, గణపతి ఖండం వివరిస్తోంది. ఎంతో సుందరమైన ఆ పర్వతం సుందర స్ఫటిక కాంతులు వెదజల్లుతుంది. అక్కడికి సమీపంలో అసంఖ్యాకంగా యక్షులు అదృశ రూపంలో నివసిస్తుంటారు. మహా యోగులు, కిన్నరులు, కింపురుషులు, ప్రమథగణాలు ఆ పరిసరాల్లో కొలువుదీరి ఉంటారు. ఇక్కడి ఆకాశగంగ నదీ తీరంలో పారిజాత వృక్షాలు, పరిమళభరితమైన పుష్పాలున్న మొక్కలు కనువిందు చేస్తుంటాయి. ఎందరో సిద్ధులు కనిపిస్తారు. విశ్వకర్మ నిర్మించిన శంకర సౌధం అద్భుతంగా ఉంటుందని గణపతి ఖండంలో ఉంది. కైలాస పర్వతానికి పశ్చిమంగా పుష్పచిత్రం, క్రౌంచం అనే పర్వతాల మధ్య ప్రదేశంలో కార్తికేయుడి అభిషేకం జరిగినట్లు చెబుతారు. దాన్ని శరవణం అని అంటారు.అక్కడికి పడమటి దిక్కున నిషిధ పర్వత శిఖరంపై మహాదేవుడు అర్చించే విష్ణువు ఆలయం ఉంటుంది
బదరీ క్షేత్రానికి ఉత్తరంగా మర్యాదా, దేవకూట అనే రెండు శిఖరాలున్నాయి. ఈ ప్రాంతంలో గరుత్మంతుడు ఉండేందుకు వీలుగా ఇక్కడ ఒక ప్రదేశం ఉంటుంది. దాని పక్కన ముఫ్ఫై ఆమడల వెడల్పు, నలభై ఆమడల పొడవున్న ఏడు గంధర్వ నగరాలుంటాయి. అక్కడే సింహకేయుడు అనే గణానికి చెందిన ఓ మహా నగరం కూడా ఉంది. అక్కడ దేవరుషులు సంచరిస్తుంటారు. హేమకూట పర్వత మధ్య భాగంలో మహాదేవుడి రావిచెట్టు ఉంది. అక్కడే ఒక పెద్ద సభాప్రాంగణం కూడా కనిపిస్తుంది. ఆ ప్రాంతంలోనే పద్మం, మహాపద్మం, మకరం, కచ్ఛపం, కుముదం, శంఖం, నీలం, నందం అనే మహానిధులున్నాయి. మందాకిని, కనకమంద, మంద అనే నదులు కూడా ప్రవహిస్తుంటాయి. మత్స్యపురాణంలో వర్ణించిన సాలతాల, తమాల, కర్ణికార, శాల్మల, న్యగ్రోధ, అశ్వద్ధ, శిరీష, వకుళ వంట ఓషధ వృక్షజాతులను ఇప్పటికీ మనం చూడొచ్చు. అందుకే హిమాలయాలను జాతి సంపదగా భావించాలి, వాటిని సంరక్షించుకోవాలి.
శరవణానికి సమీపంలో కలాప అనే గ్రామం ఉంది. సిద్ధులు, మునిగణాలు అక్కడ నివసిస్తుంటారని, మార్కండేయుడు, వశిష్ఠుడు, ఉద్దాలకుడు తదితర మహానుభావులు ఇప్పటికీ భౌతిక దేహాలతో ఉన్నారని చెబుతారు.
Poornamohan: 👆 పైన చెప్పిన విషయం లో హిమాలయాలు జంగమాలు అని చెప్పబడింది. అంటే హిమాలయ పర్వత ప్రాంతం నడుస్తూ ముందుకు కదులుతున్నాయి అని అర్థం. సంవత్సరానికి ఆరు సెంటీమీటర్లు అని ఇప్పుడు సైన్స్ చెప్తుంది. ఈ విషయం మనకు పురాణాల్లో చాలా అద్భుతంగా తెలిపారు. 19వ శతాబ్దం మొదటి వరకు మన సైంటిస్ట్ ఈ విషయాన్ని గుర్తించలేకపోయారు.
No comments:
Post a Comment