Tuesday, January 5, 2021

దేవీ నవరాత్రులు

 దేవీ నవరాత్రులు



అశ్వనీ నక్షత్రంలో పౌర్ణమి వచ్చే మాసం- ఆశ్వయుజ మాసం. కృత్తికా నక్షత్రంలో పౌర్ణమి వచ్చే నెల- కార్తీకమాసం. ఆశ్వయుజ, కార్తీక మాసములే శరదృతువు. శ్రీదేవి అంటే- ప్రకృతిలోని చైతన్యశక్తి. ప్రకృతి స్వరూపాలనన్నింటినీ జీవుడు తన మనస్సులో లయం చేసి, ఒకే ఒక చైతన్య పర తత్త్వ శక్తియందు నిలిపితే జన్మసాఫల్యాన్ని పొందుతాడు. తనలో ఉండే ఆ చైతన్య శక్తి సర్వజీవులయందు ఉంటుందనే సత్యాన్ని గుర్తించి, చైతన్యాద్వైత శక్తిని అర్థం చేసికొంటే దివ్యానుభూతిని పొందుతాడు.


‘‘సర్వరోగోపశమనం సర్వోపద్రవ నాశనం

శాన్తిదం సర్వారిష్టానాం నవరాత్ర వ్రతం శుభమ్’’


సర్వ రోగములను, సర్వ ఉపద్రవములను పోగొట్టి, సర్వారిష్టాల్ని పారద్రోలి సుఖశాంతుల్ని కటాక్షించేది- నవరాత్రి వ్రతం అని పేర్కొన్నది స్కాంధ పురాణం.

‘నవ’ అంటే తొమ్మిదని, క్రొత్త అని సామాన్యార్థాలు. కానీ, నవ అంటే పరమేశ్వరుడని, ‘రాత్రి’ అంటే పరమేశ్వరి అని నిర్ణయ సింధువు తెలుపుతోంది.


కనుక, నవరాత్రి వ్రతమంటే- పార్వతీ పరమేశ్వరుల, శివశక్తుల, ప్రకృతీ పురుషుల ఆరాధన లేక వ్రతము, పూజ అని అర్థము. నవరాత్రి వ్రతమంటే తొమ్మిది రాత్రులు చేయు వ్రతమని చెపుతారు. ‘‘సూయతే స్తూయతే ఇతి నవః’’ అనగా నవ శబ్దమునకు స్తుతిం పబడుచున్నవాడని అర్థము. పరమాత్మ ‘నవ’ స్వరూపుడు. శబ్దరూపమైన వేదం- ప్రకృష్టమైన ‘నవ్య స్వరూపం’. అదే ప్రణవ స్వరూపం. ‘‘నవో నవో భవతి జాయ మానః’’ పరమాత్మ నిత్య నూతనుడు. అందరి చేత స్తోత్రింపబడుచున్నవాడు. 


శివశక్తులకు భేదం లేదు. అం దుకే జగన్మాతకు ‘శివా’ అనే నామం కూడా ఉంది.

జగజ్జనని- ‘రాత్రి’ రూపిణి. పరమేశ్వరుడు-ప గలు. జగన్మాత ఆరాధనే- రాత్రి వ్రతం. రాత్రి దేవియే- మహాకాళి, మహాలక్ష్మి, మహా సరస్వతి వంటి రూపనామములతో పూజింపబడుతోంది. అందుకే మాతకు ‘కాళరాత్రి’ అని పేరు. నవ అహోరాత్ర దీక్షగా రాత్రి, పగలు తొమ్మిది రోజులు చేస్తారు. ‘రాత్రి శబ్దస్య తిథి వాచకత్వాత్’ అనే దాన్ని బట్టి రాత్రి అనగా తిథి అని అర్థము తీసికొని తొమ్మిది తిథులు అనగా పాడ్యమి మొదలు నవమి వరకు శ్రీదేవికి పూజ చేస్తారు.


‘పాడ్యమి’ అంటే ‘బుద్ధి’ అని చెప్పబడింది. మనుష్యుల బుద్ధియే శారదాదేవి. పాడ్యమి నుండి శారదా దేవిని ఆరాధిస్తే మంచి బుద్ధిని ప్రసాదిస్తుంది. సర్వ శుభములను చేకూర్చుతుంది. మనలో ఉన్న ఉత్సాహాన్ని పైకి వ్యక్తీకరించటమే ‘ఉత్సవం’ అంటారు. ఇది పెద్ద ఉత్సవం- మహోత్సవం. ఇది- దేవీ శరన్నవరాత్రి పూజా మహోత్సవాల అంతరార్థం.


పసుపు, కుంకుమ, పూలు, పరిమళ సుగంధ ద్రవ్యములు మొదలైన మంగళకరమైన వస్తువుల యందు, ఆవు నేతి యందు ప్రజ్వలిస్తూ ప్రకాశించే ‘జ్యోతి’ స్వరూపంలోనూ, గో మాత యందు, ముత్తయదువల యందు, త్యాగబుద్ధి కలవారి యందు భాసిల్లుతుంది- మంగళగౌరీ దేవి.సర్వ కార్య దిగ్విజయమునకు మంగళగౌరీ పూజ చెప్పబడింది. అందుకే వివాహంలో నూతన వధువు చేత గౌరీ పూజ చేయిస్తారు.


త్రిపురాసుర సంహారానికి బయలుదేరే ముందు గౌరీదేవిని అర్చించి విజయాన్ని పొందాడు పరమ శివుడు. ‘గౌరీ కల్యాణం వైభోగమే’ అంటూ అనాదిగా పెద్ద ముత్తయదువలు శుభములు పల్కుతూ కల్యాణ సమయంలో గానం చేయటం మన సంప్రదాయం.


హిమాలయ పర్వత శ్రేణిలో తెల్లని కాంతితో ఆవిర్భవించిన చల్లని తల్లి గౌరీదేవి. ‘గౌరీ గిరి రాజ కుమారీ గాన వన మయూరీ గంభీర కౌమారీ...’ అంటూ ‘గౌరీ’ రాగంలో, ముత్తుస్వామి దీక్షితులు గానం చేసిన కీర్తన నవరాత్రి పూజలో మొదటి రోజు అర్చనకు స్ఫూర్తినిస్తుంది.


చలించని మనస్సు, భ్రమించని దృష్టివలన ఏకాగ్రత సాధ్యమవుతుంది. నిష్కామబుద్ధితో తోటివారికి తోడ్పడుతూ, సమస్త జీవులపట్ల దయ, ప్రేమ, కరుణలను చూపిస్తూ, విద్యుక్త్ధర్మాన్ని సక్రమంగా నిర్వర్తిస్తూ విశ్వకల్యాణాన్ని కాంక్షిస్తే- ఏకాగ్రత సాధ్యమవుతుంది. అదే ‘ధ్యానం’. ధ్యానయోగాన్ని ప్రసాదించేది - జగన్మాత శరన్నవరాత్రి పూజ.


యాదేవి సర్వ భూతేషు మాతృరూపేణ సంస్థితా

నమస్తస్యై నమస్తస్యై సమస్తస్యై నమో నమః


ఆర్తితో అమ్మా అని పిలిస్తే నేనున్నానంటూ ఆప్యాయంగా అక్కు జేర్చుకునే ఆ తల్లికి ఏమిచ్చి ఋణం తీర్చుకోగలం... త్రికరణ శుద్ధిగా మనలను మనం అర్పించుకోవడం తప్ప. ఆ జగన్మాతకు సేవచేసే భాగ్యం నవరాత్రుల రూపంలో లభించడం మన జన్మకు లభించిన అద్భుత వరం.


నవరాత్రులలో దేవిని నవ మూర్తులుగానూ, నవశక్తులుగానూ ఆరాధిస్తారు. అయినా ఏ రోజు ఏ స్వరూపం అనేది నిర్ధిష్ట నిర్ణయంగా కనిపించదు. వరుస క్రమంలో మార్పులు ఉంటాయి. తిథి, నక్షత్రాలను బట్టి ఆనాటి రూపవిశేషం ఉంటుంది. ఆ తల్లి రూపాలు ప్రాంతీయ ఆచరాలను బట్టి వేరువేరుగా ఉంటాయి. అంటే శృంగేరి పీఠంలో, విజయవాడ కనకదుర్గ దేవి సన్నిధిలో దసరా ఉత్సవాలు, అలాగే తిరుపతి శ్రీవారి సన్నిధిలో బ్రహ్మూెత్సవాలు జరుగుతుంటాయి కాబట్టి, ఆయా ప్రాంతాలవారీగా అమ్మవారి రూపాలు మారుతుంటాయి.

No comments:

Post a Comment

RECENT POST

నవ విధ శాంతులు

నవ విధ శాంతులు కొన్ని నక్షత్ర శాంతులకై పరిహారాలు జరుపవలసిన తొమ్మిది రకాల శాంతులు. 1. తైలావలోకనం:  కంచు లేదా మట్టిపాత్రలో తగినంత మంచి నూనె పో...

POPULAR POSTS