#మధురమీనాక్షి #అద్భుత #శబ్దసౌందర్యం🌹
12 వ శతాబ్దంలో నిర్మించిన మధుర మీనాక్షి ఆలయ అందాలు చూడటానికే రెండు కళ్ళు చాలవు అనుకుంటే ఆ ఆలయ నిర్మాణం వెనుక ఉన్న శబ్ద సౌందర్యం గురించి తెలుసుకుంటే మన పూర్వీకుల, శిల్పుల నైపుణ్యం, దూరదృష్టి, ఆలయ నిర్మాణాల వెనక దాగి ఉన్న రహస్యాలు ఛేదించడానికి మన తరానికి ఉన్న మిడి మిడి జ్ఞానం సరిపోదు అనిపిస్తుంది. ఈ ఆలయ శిల్పులకు, నిర్మాతలకు శిరసా ప్రణామములు 🙏🙏🙏
పురాతన తమిళులు మధురై మీనాక్షి ఆలయంలో సంగీత స్తంభాలను నిర్మించడంలో “శరీరాల కంపనం” సూత్రాలను ఉపయోగించారు. ఈ అద్భుతమైన ఆలయం యొక్క శబ్ద సౌందర్యంపై తమిళనాడులోని ENT నిపుణుల బృందం చేసిన అధ్యయనం ప్రకారం - విభిన్న సంగీత శబ్దాలను పొందటానికి శిల్పులు సరైన రకమైన రాయిని ఎన్నుకుని స్తంభాల పొడవు, వ్యాసాన్ని చాలా తెలివిగా తయారుచేశారు. ఒకే రాయిని ఉపయోగించడం ద్వారా, దాని ఆకారాన్ని తగిన విధంగా మార్చడం ద్వారా వారు దానిని సాధించగలిగారు. మధురై జనరల్ హాస్పిటల్‌లోని ప్రాజెక్ట్ డైరెక్టర్ మరియు ENT ఇన్స్టిట్యూట్ చీఫ్ డాక్టర్ ఎస్ కామేశ్వరన్ నేతృత్వంలోని వైద్య బృందంతో పాటు, భూవిజ్ఞాన శాస్త్రవేత్తలు, సంగీత విద్వాంసులు మరియు ఆడియాలజిస్టులు ఈ పరిశోధనలో పాల్గొన్నారు. ఈ పరిశోధన ప్రాజెక్టుకు తమిళనాడు ప్రభుత్వానికి చెందిన హెచ్‌ఆర్‌సిఇ నిధులు సమకూర్చింది. ఈ ఆలయం ‘శబ్ద అద్భుతం’ అని అధ్యయన బృందం అభిప్రాయపడింది.
ఆలయంలో ఉన్న గర్భాలయంలో శబ్ద స్థాయి 40 డెసిబెల్స్ కి మించదు. ఇది మన గ్రంథాలయాల్లో ఉండే శబ్దంతో ఇది సమానం. అదే కాక ఆలయ కోనేరు, అష్టశక్తి మంటప పరిసరాల్లో కూడా శబ్ద స్థాయి ఇంచుమించు 40 డెసిబుల్స్ మాత్రమే ఉంటుంది. ఈ పరిసరాల శబ్దం ఒక వ్యక్తి దైవత్వాన్ని అనుభూతి చెందడానికి, ధ్యానం చేయదానికి సాధ్యపడుతుంది. సాయంత్రం సందర్శకులు ఎక్కువగా ఉన్న సమయంలో కూడా నమోదు చేయబడిన ధ్వని స్థాయి 70 నుండి 80 డిబి వరకు మాత్రమే ఉంది. విశేషమేమిటంటే, ఆలయంలో ఎక్కడా ప్రతిధ్వని వినిపించదు (zero echo). ప్రతిధ్వని సున్నాగా ఉండటానికి, అదే సమయంలో, మొత్తం శబ్దం నిర్దిష్ట స్థాయి 80 డిబి మించకుండా ఉండటానికి ప్రత్యేకంగా ఈ నిర్మాణం చేశారు.
ఆలయంలోని 1000 స్తంభాల మంటపం (హాల్ ఆఫ్ థౌజండ్ పిల్లర్స్ ) కూడా పరిపూర్ణ శబ్ద సాంకేతికతకు (సౌండ్ ఇంజనీరింగ్) శాస్త్రీయ ఉదాహరణ. ఈ మంటపానికి ప్రస్తుతం 985 స్తంభాలతో చాలా తక్కువ పైకప్పు ఉంది. ప్రతి స్తంభం సగటున 12 అడుగుల ఎత్తు ఉంటుంది. అన్నీ సరిగ్గా ఒకే పరిమాణం, ఒకే ఆకారం మరియు గణితశాస్త్రం ప్రకారం కచ్చితమైన స్థానాల్లో ఉంటాయి. చాలా మంది ఈ ప్రతిధ్వని లేని (ఎకో రెసిస్టెంట్) హాలులో కూర్చుని ఆలయంలోని మొత్తం కార్యకలాపాలను నిశ్శబ్దంగా వినవచ్చు.
ఈ భారీ ఆలయాన్ని నిర్మించిన శిల్పులకు కచ్చితంగా ధ్వని యొక్క ప్రాథమిక సూత్రాల గురించి తెలిసి ఉండాలి. అపరిష్కృతమైన స్తంభాలపై ఉన్న భారీ చిహ్నాలు, బయటకు వెళ్ళే ద్వారం, చుట్టుపక్కల బహిరంగ ప్రదేశాల కేటాయింపు, అన్నీ ఈ ఆలయంలో శబ్దం స్థాయిని నిర్దేశించేలా నిర్మించారని అధ్యయన బృందం తెలిపింది.
No comments:
Post a Comment