తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి కలియుగ దైవంగా ప్రసిద్ధిగాంచిన విషయం విదితమే. భక్తులు కోరిన కోర్కెలను నెరవేర్చే కొంగు బంగారంగా ఆ స్వామిని కొలుస్తారు. తిరుమలను కలియుగ వైకుంఠమని పిలుస్తారు. అయితే తిరుమల మాత్రమే కాదు, ప్రపంచంలో ఎక్కడికి వెళ్లినా వెంకటేశ్వర స్వామి విగ్రహం నిలబడి ఉన్న భంగిమలోనే మనకు దర్శనమిస్తుంది. ఇక ఆయన నాలుగు చేతుల్లో రెండు చేతులు పైకి, రెండు చేతులు కిందకు ఉంటాయి.
వెంకన్నకు పైకి ఉండే రెండు చేతుల్లో కుడి చేయి సుదర్శన చక్రాన్ని పట్టుకుని ఉంటుంది. ఎడమ చేతిలో పాంచజన్యం ఉంటుంది. వీటికి అర్థం ఏమిటంటే.. తనను పూజించే భక్తులతోపాటు అమాయకులైన వారికి హాని తలపెట్ట దలిస్తే వెంటనే దుర్మార్గులపైకి సుదర్శన చక్రాన్ని విడిచి తన భక్తులను కాపాడుకుంటాడని అర్థం.
మానవజాతికి ముప్పు పరిణమిస్తే పాంచజన్యం పూరించి శత్రువులను తన సుదర్శన చక్రంతో అంతం చేస్తాడని అర్థం.
ఇక కింద ఉన్న రెండు చేతుల్లో కుడి చేయి సగం వరకు మడిచి ఉంటుంది. అరచేయి కింది వైపుకు వరం ఇస్తున్నట్లుగా ఉంటుంది. దీన్నే వేదాల ప్రకారం వరద హస్త ముద్ర అంటారు. అంటే.. ఈ కలియుగంలో నేను తిరుమల కొండపై ఉండి నా భక్తులను కాపాడుకుంటా, నా పాదాల వద్దకు వచ్చి శరణు వేడుకునే వారిని కాపాడుతా, వారికి ఉండే కష్టాలను తొలగిస్తా.. అని అర్థం. అలాగే భక్తులకు వరాలను ఇస్తాడని కూడా అర్థం వస్తుంది.
ఇక ఎడమ చేయికి చెందిన అరచేయి నడుం వద్ద లోపలి వైపుకు మడతబెట్ట బడి ఉంటుంది. దీన్ని వేదాల ప్రకారం… కాత్య విలంబిత హస్త ముద్ర అంటారు. అంటే.. నా భక్తులు నాపై విశ్వాసం ఉంచినంత కాలం వారిని భవసాగరాల్లో ముంచెత్తను, వారిని కష్టాల పాలు కానివ్వను, సంసారమనే భవసాగరంలో వారిని నడుం కన్నా ఎక్కువ లోతుకు వెళ్లనివ్వను.. అని అర్థం వస్తుంది. అందుకనే శ్రీ వెంకటేశ చరణం శరణం ప్రపథ్యే.. అంటారు. అంటే.. వెంకటేశ్వర స్వామి చరణాల (పాదాల) మీద పడి వేడుకుంటే అన్ని సమస్యలు పోతాయని అర్థం.
No comments:
Post a Comment